కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆర్. రామకృష్ణ ప్రకటించారు. ఇలాంటి అక్రమ నిర్మాణాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం కూడా ఉందని, దాన్ని కూల్చివేస్తామన్నారు.
ఇదే అంశంపై మంగళవారం అమరావతిలో మాట్లాడుతూ, కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని చెప్పారు. అందువల్ల చంద్రబాబు నివాసం కూడా ఖాళీ చేసేంతవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.
అమరావతి మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. జగన్ తాడేపల్లిలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారని గుర్తు చేశారు. రాజధానిలో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న పనులు ఎందుకు ఆపారో ఆ కాంట్రాక్టర్లనే అడగాలని కోరారు. కాంట్రాక్టర్లకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని కలవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్సస్ టెండర్లు నిబంధనలకు విరుద్ధమన్నారు. సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రే ఉంటారని ఆర్కే స్పష్టం చేశారు.