వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉత్తర అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవకాశముందని అన్నారు.
ఇది వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో పశ్చిమ దిశ నుండి గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాగల 3 రోజులు రాష్ట్రంలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో నేడు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.