భార్య మెడలో మూడుముళ్లు వేశాడు. మూడు నెలల పాటు కాపురం కూడా చేశాడు. కానీ, పెళ్లికి ముందు తాను ప్రేమించిన యువతిని వీడి ఉండలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన విశాఖ జిల్లాల జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ జిల్లా ఊటగడ్డ ప్రాంతానికి చెందిన బొజ్జా సాయికుమార్ (28) అనే వ్యక్తి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఆ సమయంలో ఆ ఆస్పత్రిలోనే పని చేసే ఓ యువతిని ఇష్టపడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పైగా, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు.
కానీ, ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోగా, తమ తమ పెద్దలు చెప్పినట్టుగా వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలో సాయి కుమార్‌కు మూడు నెలల క్రితం శ్రావణి అనే యువతితో వివాహమైంది. మూడు నెలల పాటు సంసారం జీవితం సాఫీగానే సాగింది.
కానీ, ప్రియురాలిని విడిచిపెట్టి ఉండలేకపోయాడు. ఈ క్రమంలో భార్య ఉన్నప్పటికీ ప్రియురాలితో ఫోనులో మాట్లాడటం, చాటింగ్ చేయసాగాడు. దీంతో శ్రావణి కోపగించుకుని పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరివాడయ్యాడు. దీన్ని భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. సూసైడ్ చేసుకునే ముందు.. భార్య శ్రావణికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భార్య ఆందోళనకు గురై ఇంటికి వచ్చే చూసేసరికి భర్త విగతజీవుడై కనిపించాడు. ఇక చేసేదేం లేక పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.