Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ వ‌ల్ల సంక్షోభంలో ట్రాన్స్ పోర్ట్ రంగం... 30 వేల లారీల సీజ్!

Advertiesment
కోవిడ్ వ‌ల్ల సంక్షోభంలో ట్రాన్స్ పోర్ట్ రంగం... 30 వేల లారీల సీజ్!
విజ‌య‌వాడ‌ , శనివారం, 15 జనవరి 2022 (15:39 IST)
కోవిడ్ ప్ర‌భావం వ‌ల్ల‌, లాక్డౌన్ల కాలంలో దేశ‌వ్యాప్తంగా ట్రాన్స్ పోర్ట్ రంగం తీవ్రంగా దెబ్బ‌తింది. లారీల‌కు కిస్తీలు, వాయిదాలు కట్టలేకపోవడంతో వేల సంఖ్య‌లో లారీల‌ను బ్యాంకులు, ఆర్ధిక సంస్థ‌లు జప్తు చేశాయి. దేశ వ్యాప్తంగా సంక్షోభంతో ఒక్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే 30 వేల లారీలు ఇలా సీజ్ అయిపోయాయ‌ని స‌మాచారం.
 
 
కొవిడ్‌ ప్రభావం సరకు రవాణా రంగంపై తీవ్రంగా పడింది. అనేక పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తులు చేయకపోవడం, కిరాయిలు లేకపోవడంతో లారీల యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో కిరాయిలు గిట్టుబాటుకాక సమస్యగా మారింది. మూడు, నాలుగు నెలలుగా పరిస్థితులు చక్కబడుతున్నాయని భావిస్తున్న తరుణంలో మళ్లీ ఇపుడు కొవిడ్‌ మూడో దశ ఆందోళనకు గురిచేస్తోంది. 
 
 
గత పరిస్థితులు పునరావృతమైతే, రవాణా వ్యాపారాన్ని వదిలేసుకోవాల్సి వస్తుందని లారీల యజమానులు చెబుతున్నారు. రాష్ట్రంలో మూడు లక్షల లారీలు ఉంటే.. అందులో 30 వేలకు పైనే (10 శాతం) లారీలకు వాయిదాలు (లారీల కొనుగోలుకు తీసుకున్న రుణాలకు) చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. మరి కొందరు యజమానులు ఈ పరిస్థితులు తట్టుకోలేక లారీలను అమ్మేసుకున్నారు. దీంతో ఈ రంగంపై ఆధారపడి ఉపాధి పొందే అనేక మందికి పని లేకుండా పోయింది. 
 
 
2019లో ఒక్కసారిగా రాష్ట్రంలో నిర్మాణరంగంలో అనిశ్చితి నెలకొంది.  2020 ఆరంభంలో కొవిడ్‌ తొలిదశ ఆరంభం, మార్చిలో లాక్‌డౌన్‌తో సరకు రవాణారంగం పై తీవ్ర ప్రభావం మొదలైంది.  మొదటిదశ తర్వాత కొంత వరకే లారీలు రోడ్డెక్కాయి. ఇంతలో కొవిడ్‌ రెండో దశతో మరోసారి డీలా పడ్డాయి.  డీజిల్‌ ధరలు కూడా అమాంతం పెరగడంతో కిరాయిలు గిట్టుబాటు కాకుండా చేసింది. అయితే గత ఏడాది చివర్లో కొంత పురోగతి కనిపించింది. ఇంతలో మూడో దశరూపంలో మరోసారి ఆందోళన నెలకొంటోంది.
 
 
కొవిడ్‌ రెండు దశల్లోనూ రాత్రి కర్ఫ్యూలు కారణంగా కొన్నిచోట్ల సరకు రవాణా వాహనాలను పోలీసులు నిలిపేసేవారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు లోడుతో వెళ్లిన లారీలకు ఇబ్బందులు ఎక్కువగా ఉండేవి.  దూర ప్రాంతాలకు వెళితే తిరుగు ప్రయాణానికి కిరాయిలు లభించక వారంపాటు అక్కడే వెచిఉండాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా పలు రాష్ట్రాలు, వివిధ నగరాల్లో వారాంతపు లాక్‌డౌన్‌లు, రాత్రి కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. దీంతో మరోసారి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. 
 
 
లారీలు అమ్మేసి డ్రైవర్‌ అయ్యాన‌ని విజ‌య‌వాడ‌లోని లారీ ఓన‌ర్ కన్నారెడ్డి చెపుతున్నారు. ఒక లారీతో మొదలుపెట్టి అయిదు లారీలకు యజమాని అయ్యాను. నావద్ద డ్రైవర్లు క్లీనర్లు కలిపి కనీసం 10 మంది పనిచేసేవారు. కొవిడ్‌ ప్రభావం కారణంగా కిరాయిలు లేక రెండేళ్లలో లారీలన్నీ అమ్మేశాను. ఇప్పుడు ఓ సంస్థలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. సీజ్‌ చేసిన వాటినీ అమ్మలేని పరిస్థితి అని క‌న్నారెడ్డి వివ‌రించాడు.
 
 
రాష్ట్రంలో మూడు లక్షల లారీలు ఉండగా.. కొవిడ్‌ ప్రభావంతో వీటిలో 2 లక్షల లారీలకు కిరాయిలు అంతంతమాత్రంగా లభించేవి. వాయిదాలు చెల్లించకపోవడంతో పలు ఫైనాన్స్‌ సంస్థలు 30 వేలకుపైగా లారీలను సీజ్‌ చేసి, స్వాధీనం చేసుకున్నాయి. ముఖ్యంగా ఒకటి, రెండు లారీలు కలిగిన యజమానులు ఫైనాన్స్‌ సంస్థలకు లారీలను వదులుకున్నారు. సీజ్‌చేసిన లారీలను సైతం కొనేవారు లేకపోవడంతో కొన్ని ఫైనాన్స్‌ సంస్థలు మాత్రం రుణాల చెల్లింపునకు గడువు ఇస్తున్నాయి.
 
 
ఇక లారీల అమ్మ‌కాలు కూడా మూడింతలు పడిపోయాయి. లారీల విక్రయాలు గత రెండేళ్లుగా దారుణంగా పడిపోయాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కలిపి ఏటా సగటున 2 వేలకుపైన లారీలను విక్రయించేవాళ్లం.  కొవిడ్‌ ప్రభావంతో 2020లో 400 లారీలు, 2021లో 440 లారీలు మాత్రమే విక్రయించగలిగాం. ఇపుడు మళ్లీ మూడో దశతో ఈ ఏడాది కూడా పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు అని ఓ ప్రముఖ కంపెనీ డీలర్‌ పేర్కొన్నారు. లారీలకు ఫైనాన్స్‌ దాదాపు తగ్గించాం అని  ఓ వాహన ఫైనాన్స్‌ సంస్థ నిర్వాహకుడు చెప్పారు. గతంలో ఏటా 1,500 వాహనాలకు ఫైనాన్స్‌ చేసేవాళ్లం. ఇందులో 50-60 శాతం భారీ వాహనాలు ఉండేవి. ఇపుడు చిన్న వాహనాలకే ఫైనాన్స్‌ ఇస్తున్నాం. భారీ వాహనాలకు కేవలం 5-10 శాతమే ఫైనాన్స్‌ చేస్తున్నాం అని వివ‌రించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినుకొండ రైతు నరేంద్రను జైలు నుంచి విడుదల చెయ్యాలి...