తిరుపతిలో ఆకతాయిలు రెచ్చిపోయారు. రోడ్లపైన తిరగవద్దని చెప్పినందుకు ఒక వృద్ధురాలిపై కత్తులతో దాడికి దిగారు. కొర్లగుంటలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి ఎదురుగా ఒక వృద్ధురాలు కిరాణా కొట్టు నడుపుతోంది. లాక్ డౌన్ ఉన్నా ఆరుమంది యువకులు అటు ఇటూ తిరుగుతూ కనిపించారు.
రోడ్లపై తిరగకూడదని యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది వృద్ధురాలు. యువకులు వినిపించుకోకపోవడంతో అటువైపుగా వెళుతున్న పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు యువకులను హెచ్చరించి పంపేశారు. వృద్ధురాలిపై కక్ష పెంచుకన్న యువకులు ఆమెపై దాడి చేసి గాయపరిచారు. కిరాణా కొట్టులో ఉన్న సామాన్లను ధ్వంసం చేసి అక్కడి నుంచి పారిపోయారు.
వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గాయపడిన బాధితురాలి మనువడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆరుగురు యువకుల కోసం గాలిస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చాలామంది యువకులు రోడ్లపై ఆకతాయిగా తిరుగుతూ కనిపిస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా బేఖాతరు చేస్తూ యథావిథిగా వారు రోడ్లపైన తిరుగుతూనే ఉన్నారు.