"పాపమని పాత చీర ఇస్తే ఊరంతా మూరేసిందట వెనుకటికొకతే... అలా వుంది మీ వ్యవహారం. ఉండటానికి ఇల్లు లేదని అప్పట్లో ముఖ్యమంత్రి కి నా ఇల్లు ఇస్తే దానినే కూల్చేయాలని మీరు ప్రయత్నిస్తుండడం ఏమాత్రం సరికాదు" అంటూ సీఎం జగన్‌కు వ్యాపారవేత్త లింగమనేని రమేష్ లేఖ రాశారు.
చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన ఇంటి దగ్గర సీఆర్‌డీఏ అధికారులు చేస్తున్న హడావుడి ఆందోళనకు గురిచేస్తోందన్నారు. 2014లో సీఎం నివాసానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు కోరితే తన అతిథి గృహాన్ని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చేందుకు ఒప్పుకున్నానని చెప్పారు.
తన నిర్ణయం వెనుక రాజకీయ, ఆర్ధిక ప్రతిపాదనలు లేవని లేఖలో పేర్కొన్నారు. బాధ్యత గల పౌరుడిగా దీనికి అంగీకరించానని చెప్పారు. అప్పట్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా...ఎవరు సీఎంగా ఉన్నా...తను ఇలాగే స్పందించేవాడినని లేఖలో లింగమనేని రమేష్ పేర్కొన్నారు.
అప్పటి సీఎంకు ఇంటిని అద్దెకు ఇచ్చినందున నేను ఆయనకు బినామీనని అవాస్తవాలు ప్రచురించి ఆవేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నివాసానికి ఉండవల్లి పంచాయతీ, కృష్ణా సెంట్రల్ డివిజన్ ఏఈ, ఇరిగేషన్ అధికారుల నుంచి ఎన్‌వోసీ తీసుకున్నానని చెప్పారు.
కరకట్ట వెంబడి మొదలైన కూల్చివేతలు తమ ప్రాంతానికి కూడా వస్తాయని అందరూ భయపడుతున్నారని పేర్కొన్నారు. ‘‘నా ఆస్తులపై విచారణ జరపాలని మీరు ఆదేశించారు. కొత్తగా నేను మీకు తెలియజేయాల్సింది..నేను దాచిపెట్టింది ఏమీలేదు’’ అని లేఖలో లింగమనేని రమేష్ పేర్కొన్నారు.