Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జలాల వినియోగం.. విభజన చట్టంపై సీఎంల చర్చ

జలాల వినియోగం.. విభజన చట్టంపై సీఎంల చర్చ
, మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (05:38 IST)
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌... హైదరాబాద్​లోని ప్రగతిభవన్​లో సమావేశమయ్యారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలపై 4 గంటలకు పైగా చర్చించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం హైదరాబాద్​లో ముగిసింది.

ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. లోటస్‌ పాండ్‌ నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న జగన్‌కు కేసీఆర్‌ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలతో పాటు గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగంపై ఈ భేటీలో ముఖ్యమంత్రులు చర్చించారు.

విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌లోని సంస్థలపై సమాలోచనలు చేశారు. వీలైనంత తక్కువ భూసేకరణ, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.

గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించారు. దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌లోకి గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి రివర్సబుల్‌ టర్బైన్స్‌ ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని తరలించే అంశంపై  ఈ సమావేశంలో కేసీఆర్, జగన్‌ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

నాగార్జున సాగర్‌ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా కనీసం 230 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ ఇక్కడి నుంచి శ్రీశైలం జలాశయానికి రివర్స్‌ టర్బైన్స్‌ ద్వారా నీటిని తరలించే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలియవచ్చింది.

దీంతోపాటు పలు ఇతర ప్రత్యామ్నాయాలను సీఎంలు ఇద్దరూ పరిశీలించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై మరోసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్ల స్థాయిలో సమావేశాలు జరిపి సాంకేతికపరమైన అంశాలపై అధ్యయనం జరిపించాలనే అభిప్రాయానికి వచ్చారు.

గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే దక్షిణ తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల రైతు సమస్యలు తీరుతాయని సీఎంలిద్దరూ అభిప్రాయపడ్డారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా నదీ జలాల తరలింపు, నీటి వినియోగం జరిపే దిశగా చర్చలు సాగాయి. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని సీఎంలు నిర్ణయం తీసుకున్నారు.
 
తెలంగాణ పోలీసులకు ఏపీలో శిక్షణ
విద్యుత్, పోలీస్‌ ఉద్యోగుల విభజనతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇతర పెండింగ్‌ అంశాలపై సీఎంలిద్దరూ ఈ సమావేశంలో చర్చలు జరిపారు. తెలంగాణలో 18 వేల మంది పోలీసులను ఒకేసారి నియమిస్తున్న నేపథ్యంలో వారందరికీ ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు స్థలం చాలనందున 4 వేల మందికి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్‌ను కోరారు.

ఇందుకు జగన్‌ సానుకూలంగా స్పందించారు. పోలీసులకు ఒకేసారి శిక్షణ ఇవ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలగనుంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సావాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ వైఎస్‌ జగన్‌ ఆహ్వాన పత్రిక అందించారు.

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌తోపాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాకినాడ జీజీహెచ్ లో మాతా శిశు ఆరోగ్య కేంద్రం