ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికా పర్యటనపై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ మండిపడుతున్నారు. అదేవిధంగా... ప్రతి పక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటాన్ని కూడా కన్నా తప్పుపట్టారు.
ఓ వైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏమీ పట్టనట్లు వీరిద్దరూ వ్యవహరిస్తున్నారని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల దాటికి కృష్ణా నది పొంగి పొర్లుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురౌతున్నాయి. దీంతో... ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కరకట్ట సమీపంలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్దకు కూడా వరద నీరు చేరుకుంది.
ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదమే నడుస్తోంది. ఇదిలా ఉంటే వరదల కారణంగా సామాన్య ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. అయితే.. ప్రజల గురించి మాత్రం అధికార, ప్రతిపక్ష నేతలు పట్టించుకోవడం లేదని కన్నా మండిపడుతున్నారు. చంద్రబాబు, జగన్ లపై విమర్శల వర్షం కురిపించారు.
"రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన 'కొంప మునిగి' హైదరాబాద్ జారుకున్నారు. వారిద్దరి 'తోక నేతలు' చేస్తున్న చర్చఇల్లు మునిగిందా.. లేదా అని.
ఇల్లు సంగతి వదిలేయండి. మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోంది"అని కన్నా తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ వ్యాఖ్యలకు టీడీపీ, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.