ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రూల్ అమల్లోకిరానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆసక్తికరమైన ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై ఏపీలో పెంచుకునే కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ ఆదేశాలను జారీచేసింది. ఈ జంతువులకు టోకెన్లను జారీచేయాలని తెలిపింది. ఈ టోకెన్లు వాటి మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
లైసెన్స్‌లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే వాటికి సంబంధించిన యజమానికి రూ.500 అపరాధం విధించనున్నారు. అంతేకాదు, రోజుకు రూ.250 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఒకవేళ అవి తమవంటూ ఎవరూ ముందుకు రాకపోతే వాటిని వీధి కుక్కలు, పందులుగా గుర్తించి, వాటికి కుటుంబ నియంత్రణ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కుక్కలు, పందులకు లైసెన్స్ ముగిసిపోతే తిరిగి 10 రోజుల్లోగా లైసెన్సును పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
కుక్కల లైసెన్సులను ఆయా యజమానులకు అందించే సమయంలో వాటి హెల్త్ సర్టిఫికెట్లు కూడా అందించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్‌ను అందించాలని ఆదేశించింది.