అన్యోన్య దాంపత్యం. ఇద్దరు పిల్లలు. రెండు చేతులా సంపాదిస్తున్న భర్త. అయితే కరోనా పుణ్యమా అని ఉన్న ఉద్యోగం పోయింది. అప్పుల పాలయ్యారు. భర్త మద్యానికి బానిసయ్యాడు. భార్యను అదనపు కట్నం తీసుకురమ్మని చిత్రహింసలకు గురిచేశాడు. అంతటితో ఆగలేదు. భార్యాభర్తలిద్దరూ కలిసి వున్న ఏకాంత వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడు.
గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాద్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక యువతితో 2016 సంవత్సరంలో వివాహం చేశారు. కట్నం కింద 5 లక్షల రూపాయల నగదు, 5 సవర్ల బంగారం, సామాన్లు, 10 లక్షల రూపాయల విలువచేసే ఇంటిస్థలాన్ని ఇచ్చారు. 2018 సంవత్సరంలో ఒక కూతురు, 2019 సంవత్సరంలో కొడుకు పుట్టారు.
గుంటూరు జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు ప్రసాద్. కరోనా కారణంగా ఫ్యాక్టరీ మూతపడింది. తిరిగి ఫ్యాక్టరీని తెరవలేదు. దీంతో ప్రసాద్ తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేశాడు. ఆ అప్పులు తడిసిమోపడయ్యాయి. అప్పులు కట్టలేక మద్యానికి బానిసై ఉన్న డబ్బును తాగుడుకు తగలేశాడు ప్రసాద్.
మద్యం మత్తులో భార్యతో గొడవపడి పుట్టింటికి వెళ్ళి అదనపు కట్నం తీసుకురమ్మని వేధించేవాడు. దీంతో భార్య, భర్త హింసను తట్టుకుంటూ వచ్చింది. కానీ గత వారంరోజుల నుంచి ప్రసాద్ తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను తనకే చూపించాడని.. ఆ వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.
అదనపు కట్నం తీసుకురాకుంటే మొత్తం వీడియోలను ఇంటర్నెట్లో పెడతాడని చెప్పడంతో చివరకు బాధితురాలు మహిళా పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడు పరారయ్యాడు.