Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతి ధాన్యపు గింజనూ కొంటాం: వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

ప్రతి ధాన్యపు గింజనూ కొంటాం: వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
, గురువారం, 10 జూన్ 2021 (19:20 IST)
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా తమ పేరును ‘ఈ పంట’లో నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి అధిక ప్రాధాన్యతిస్తూ, ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ లో భాగంగా రూ.1190.11 కోట్లతో లక్షన్నర హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ విస్తరింపజేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. 

వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాలులో పంటల కొనుగోలుపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు వ్యవసాయ, సివిల్ సప్లయ్ శాఖాధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశంలో మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఎం.శంకర నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి  సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. 

దీనిలో భాగంగా ప్రతి ధాన్యపు గింజనూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల కొనుగోలు చేయనున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ఆర్బీకేల ద్వారా ‘ఈ పంట’లోని Paddy Procurement Online పోర్టల్‌లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవడం వల్ల ఇతర రాష్ట్రాల రైతులు ఏపీలో తమ పంటలను విక్రయించుకునే అవకాశం ఉండదన్నారు. 

రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతుల పొలాల వద్దకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనివల్ల దళారులు/మధ్యవ్యర్తుల ప్రమేయం ఉండదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరవాత 21 రోజుల్లో రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు కనీస మద్దతు ధర లభిస్తోందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 11.90 లక్షల మంది రైతులు 13.43 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు 2021-21 సంవత్సరానికి సంబంధించి మరో లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.1190.11 కోట్లు వెచ్చిస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేసే రైతులకు 90 శాతం సబ్సిడీ అందజేస్తామ‌ని తెలిపారు.

రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో 4 హెక్టార్లు కలిగిన రైతులకు 70 శాతం, 5 హెక్టార్లు కలిగిన ప్రకాశం జిల్లా మినహా మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల రైతులకు 50 శాతం మేర సబ్సిడీ అందజేయనున్నామన్నారు. రబీ సీజన్‌లో నేటి వరకూ ఎన్ని టన్నుల మేర ధాన్యాన్ని  కొనుగోలు చేశారని సివిల్ సప్లయ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ ప్రతి రైతుకూ ఆర్థికంగా మేలు చేయాల‌న్న‌దే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపితే, అధికారుల సాయంతో వాటిని పరిష్కరిస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలోనే అమరావతి ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం: బాలకృష్ణ