Publish Date: Mon, 26 Jul 2021 (09:41 IST)
Updated Date: Mon, 26 Jul 2021 (09:41 IST)
ఇటీవలి కాలంలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. జనావాస ప్రాంతాల్లోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన సింగరికోనకు బైక్‌పై వెళ్తున్న దంపతులపై చిరుత దాడి చేసింది. ఈ దాడి నుంచి వారు తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన దంపతులు నిన్న బైక్‌పై సింగరికోనకు బయలుదేరారు. మార్గమధ్యంలో పొంచి వున్న ఓ పులి వీరిపై ఒక్కసారిగా దాడి చేయడంతో కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి ఓ కారు రావడంతో బెదిరిన చిరుత అక్కడి నుంచి పరారైంది.
గాయపడిన దంపతులను వెంటనే పుత్తూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మధ్యాహ్నం నగరికి చెందిన మరో జంటపైనా పులి దాడికి యత్నించింది. విషయం తెలిసి అప్రమత్తమైన పోలీసులు, అటవీశాఖ అధికారులు సింగరికోన మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు.