జనసేనకు ఎదురుదెబ్బ.. ఆ స్థలానికి చట్టబద్ధత లేదట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో అంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పవన్ భావించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో అంటే గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పవన్ భావించారు. ఇందుకోసం కొంతమంది నుంచి స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. స్థలం దాతలకు కూడా ఇటీవల పవన్ సన్మానం కూడా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.
ఇపుడు ఎదురుదెబ్బ తగిలింది. మంగళగిరికి సమీపంలోని చినకాకానిలో జనసేన పార్టీకి కేటాయించిన స్థలం న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. యార్లగడ్డ సుబ్బారావు వారసుల నుంచి జనసేన పార్టీ తీసుకున్న లీజుకు చట్ట బద్దత లేదంటూ, ఆ స్థలం వారసులుగా వున్న మైనారిటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ముస్లిం మైనారిటీలు, యార్లగడ్డ సుబ్బారావు మధ్య స్థలంపై వివాదం చోటుచేసకుంది. భూమి వ్యవహారంలో స్టే ఉందని మైనార్టీలు జనసేనానికి విషయం తెలియజేశారు. స్థలం విషయంపై మైనార్టీలు పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. దీనిపై జనసేనకు చెందిన స్థానిక నేతలు లేదా హీరో పవన్ కళ్యాణ్ తరపున ప్రతినిధులు స్పందించలేదు.