జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శైలి, నైజం తనకు బాగా నచ్చాయని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆయన బుధవారం చుట్టుగుంటలోని శాతవాహన కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓడినా.. ప్రజలను అంటిపెట్టుకొని ఉండటం అభినందనీయమన్నారు. ఈ విషయంలో ఆయన శైలి నాకు బాగా నచ్చిందన్నారు.
ఇకపోతే, వైకాపా పాలన ఎలా ఉందో మరో మూడేళ్ల తర్వాత తెలుస్తుందన్నారు. పోటీ వల్లే సంక్షేమానికి పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయాలని సూచించారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోనని, సర్వేలకు దూరంగానే ఉంటానని స్పష్టం చేశారు.
అదేసమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయన్నారు. కాగా రాష్ట్ర విభజన తర్వాత లగడపాటి రాజగోపాల్ ముందుగా ప్రకటించినట్టుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెల్సిందే.