రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఏపీకి చెందిన యువతి వర్షిణిని వెంట తీసుకుని తిరుగుతున్న అఘోరి.. తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఆలయంలో ఈ వివాహం జరిగినట్టు సమాచారం.
వర్షిణి మెడలో అఘోరి తాళి కడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షిణి, అఘోరి దండలు మార్చుకోవడం, తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి.
ఏపీలోని నందిగామలో అఘోరికి వర్షిణికి పరిచయం ఏర్పడింది. వివస్త్రగా ఉన్న అఘోరికి వర్షిణి సాయం చేయడం, ఆ తర్వాత వర్షిణి కుటుంబ సభ్యులు ఆహ్వానంతో అఘోరి వారి ఇంట్లో కొన్ని రోజులు గడిపింది. అక్కడి నుంచి వెళ్లిపోతూ వర్షిణిని కూడా అఘోరి తన వెంట తీసుకెళ్లింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లగా వర్షిణి కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిణి మళ్లీ పారిపోయి అఘోరిని కలుసుకుంది. తాజాగా అఘోరిని పెళ్లాడింది.