ఏపీలోని కర్నూలు జిల్లాలో కొత్త సవంత్సరం పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. మెంతో ప్లస్ తైలం డబ్బాను మింగిన పది నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివాహమైన 20 యేళ్ల తర్వాత కలిగిన ఒక్కగానొక్క సంతానం కావడం గమనార్హం. దీంతో ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.
కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామానికి చెందిన నల్లన్న - సువర్ణ దంపతుల ఏకైక కుమారుడు ఆదివారం కొత్త సంవత్సర వేడుకల రోజున మెంతో ప్లస్ తైలం డబ్బాను నోట్లో పెట్టుకున్నాడు. ప్రమాదవశాత్తు అది నోట్లోకి జారుకుంది. దీన్ని గమనించిన తల్లిదండ్రులు బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. 20 యేళ్ల తర్వాత పుట్టిన సంతానం కళ్లెదుటే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.