ఆ సారు చేతికి గాయం అయింది... అయినా తన చెకింగ్ మాత్రం ఆపలేదు... చేతి కర్ర పట్టుకుని మరీ అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి చెకింగ్ చేస్తున్నారు. తన జిల్లాలోని పోలీసింగ్ ఎలా పనిచేస్తోందో పరీక్షిస్తున్నారు. ఆయన ఎవరో కాదు సూపర్ కాప్... కృష్ణా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.
కృష్ణా జిల్లా మండవల్లి పోలీస్ స్టేషన్ ను కృష్ణా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సందర్శించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చిన ఎస్పీ మండవల్లి పోలీస్ స్టేషన్ ఆసాంతం పరిశీలించారు. ముందుగా సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు, పోలీస్ స్టేషన్ పనితీరు, సిబ్బంది వివరాలు, ఎస్సై చల్లా కృష్ణని అడిగి తెలుసుకున్నారు, పోలీస్ స్టేషన్లో మహిళా సిబ్బంది ఎంత మంది ఉన్నదీ, పోలీస్ స్టేషన్లో మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ నిర్వహణ, భద్రత అన్నింటిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
కృష్ణా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చేతికి ఇటీవల గాయం అయింది. అయినా ఆయన డ్యూటీ మానలేదు. అలాగే జిల్లాలో వినూత్నంగా రోజూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవలం ఆయన మచిలీపట్నంలోని తన జిల్లా కార్యాలయానికి పరిమితం కాకుండా, చేతి కర్ర సాయంతోనే జిల్లా అంతటా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా రూరల్ లో ఉన్న పోలీస్ స్టేషన్ల నిర్వహణ, ప్రజా భద్రతలపై పర్యవేక్షిస్తున్నారు. చేతికర్రతో తనిఖీకి వచ్చిన ఎస్పీని చూసి, కింది స్థాయి సిబ్బంది అబ్బుపడుతున్నారు.