మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అంటూ రకరకాలుగా కథనాలు వచ్చాయి. చిరంజీవి పుట్టినరోజున ఎన్నికల తేదీని ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ నిరాశే మిగిలింది. ఆ రోజున క్రమశిక్షణా సంఘం, గౌరవ అధ్యక్షుడు కృష్ణంరాజు ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. అందులోని సారాంశం అంతా క్రోడీకరించిన పిదప బుధవారంనాడు సాయంత్రం ఎన్నికల తేదీని ప్రకటించారు. మా లెటర్ పేడ్‌లో నరేశ్ సంతకంతో అక్టోబర్ 10న మా ఎన్నికలు నిర్వహించేందుకు మా ఎన్నికల తేదీని క్రమశిక్షణ కమిటీ అధికారిక ప్రకటన చేసింది.
కాగా, ఈసారి మా అధ్యక్ష పదవికి పోటీ పెరిగింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ, జీవితా రాజశేఖర్, సీవిఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ఒకరిపై ఒకరు ఆరోపణలతో సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలతో మా ప్రతిష్ట మసకబారుతోందని క్రమశిక్షణ కమిటీకి లేఖలు కూడా వెళ్లాయి. ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయంటూ ప్రకాష్‌రాజ్ రోజుకో ట్వీట్ చేస్తున్నాడు. ఇక మంచు విష్ణు టీవీ ఇంటర్వ్యూలో సేవ చేయడానికి నిలబడినట్లు ప్రకటించారు. మా భవనంకోసం మూడు స్థలాలు చూసినట్లు వెల్లడించారు.