భారతదేశం తరుపున కొరియా దేశానికి రాయబారిగా ఉన్న శ్రీప్రియ రంగనాధన్ సోమవారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో కొరియన్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలపై వారు చర్చించారు. అనంతరం సిఎస్ నీలం సాహ్ని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘ మైన సముద్ర తీరం ఉందని తీరం ప్రాంతంలో వివిధ పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఓడరేవులు, విమానాశ్రయిలు అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆహార శుద్ధి రంగం అభివృద్ధికి,అలాగే చేపలు, రొయ్యల సాగుకు సంబంధించి ఆక్వా రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్త పోర్టులు కూడా ఏర్పాటు కానున్నాయని ఎగుమతి దిగుమతులకు సంబంధించి దేశంలోని వివిధ రాష్ట్రాలకే గాక విదేశాలకు ఎగుమతి దిగుమతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అనువుగా ఉంటుందని సిఎస్ నీలం సాహ్ని చెప్పారు.
భారత్ తరుపున కొరియా దేశానికి రాయబారిగా ఉన్న శ్రీప్రియ రంగనాధన్ మాట్లాడుతూ రేవుల అభివృద్ధి, మారిటైమ్ శిక్షణ, నైపుణ్య శిక్షణ తదితర అంశాలకు సంబంధించి కొరియన్ సంస్థలు రాష్ట్రంతో పనిచేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల వివిధ అవకాశాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. భేటీలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రంజిత్ భార్గవ తదితరులు పాల్గొన్నారు.