Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి కోడికత్తి శ్రీను పోటీ!!

kodi katti srinu

ఠాగూర్

, మంగళవారం, 12 మార్చి 2024 (08:09 IST)
వైకాపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను జై భీమ్ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ సమక్షంలో కోడికత్తి శ్రీను పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కోడికత్తి శ్రీనుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా, త్వరలోనే జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కోడికత్తి శ్రీనివాస్‌ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ దింపాలని జైభీమ్ పార్టీ భావిస్తుంది. అయితే, దీనిపై ఆ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ స్పష్టత ఇవ్వాల్సివుంది. 
 
టీడీపీ - జనసేన - టీడీపీల మధ్య సీట్ల పంపిణీ పూర్తి... 
 
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సీట్ల సర్దుపాటు పూర్తయింది. ఏపీలోని అధికార వైకాపాను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి. ఇందులోభాగంగా, ఈ మూడు పార్టీలు కలిసి సీట్ల సర్దుబాటు అంశంపై విజయవాడలోని ఉండవల్లిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సుమారు ఎనిమిది గంటల పాటు సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. 
 
ఇందులో టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ సీనియర్ నేతలు గజేంద్ర షెకావత్, బైజయంత్ పండాలు పాల్గొన్నారు. ఇందులో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై క్షుణ్ణంగా చర్చించారు. సుధీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. 
 
పొత్తులో భాగంగా, జనసేన, బీజేపీకి కలిపి 31 అసెంబ్లీ స్థానాలు, ఎనిమిది లోక్‌‍సభ సీట్లను కేటాయించారు. ఇందులో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా, బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లలో బరిలోకి దిగనుంది. 
 
కాగా, ఇటీవల జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుందని, ప్రకటించినప్పటికీ బీజేపీ కూడా పొత్తులోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చేసిన ప్రకటనలో నేడు సవరణలు చేశారు. సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చన నేపథ్యంలో మూడు పార్టీలు అభ్యర్థుల జాబితాపై దృష్టిసారించనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పౌరసత్వ సవరణ చట్టం - సీఏఏను అమల్లోకి తెచ్చిన కేంద్రం.. నోటిఫికేషన్ జారీ