ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు, మదనపల్లెలు టమోటా మార్కెట్‌లు కీలకంగా ఉన్నాయి. ఇక్కడ నుంచే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి.
అయితే, గత కొన్ని రోజులుగా టమోటా ధర భారీగా పడిపోయింది. ఒకవైపు దిగుబడి పెరిగిపోవడం, మరోవైపు వర్షాల కారణంగా విక్రయాలు పడిపోవడంతో ఈ వీటి ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో కర్నూలు మార్కెట్‌లో కిలో టమోటాల ధర రూ.2గా పలుకుతోంది. దీంతో టమోటా రైతులు బోరుమంటున్నారు.
మార్కెట్‌కు తీసుకొచ్చిన టమోటాను అమ్మలేక, అలాగని తిరిగి తీసుకెళ్లలేక మార్కెట్‌లోనే వాటిని పారబోస్తున్నారు. మార్కెట్‌కు బుధవారం 350 క్వింటాళ్ళ టమోటా వచ్చింది. వాటిలో ఓ మాదిరిగా ఉన్న టమోటా ధర కేజీ రూ.4 పలుకగా మిగితా వాటికి కిలోకు అర్థ రూపాయి కూడా రాదని వ్యాపారులు చెప్పడంతో రైతులు నిర్ఘాంతపోయారు.
దీంతో దిక్కుతోచని రైతులు వాటిని అక్కడే పారిబోసి వెళ్లిపోయారు. ఒక ఎకరాలో టమోటా పంట పండించేందుకు రైతు రూ.30 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. తీరా పంటకు చేతికి వచ్చాక వాటి ధరలు అమాcతం పడిపోవడంతో వారు బోరున విలపిస్తున్నారు.
అయితే, ప్రధాన మార్కెట్‌లో పరస్థితి దారుణంగా ఉంటే, బహిరంగ మార్కెట్‍లో మాత్రం కిలో టమోటా ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతుంది.