ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా? ఫ్రంట్ కోసం ఏచూరీతో మాట్లాడా: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంల
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని కేసీఆర్ అన్నారు.
కేంద్రంపై పోరాడాలని నిశ్చయించామని.. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదని చెప్పారు. రిజర్వేషన్లను కేంద్రం దగ్గర పెట్టుకోవడం సరికాదని తెలిపారు. రాష్ట్రాల పరిధిలో రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి కేంద్రం పరిధిలో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
ఆర్టికల్ 16, 4 ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి వుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పును మార్చే అవకాశం వుంది. పారిశ్రామిక రాయితీలు కేంద్రం ఏమిచ్చిందో కూడా అర్థం కావట్లేదని, రిజర్వేషన్లు, పారిశ్రామిక రాయితీలపై కేంద్రంపై పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయం అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఎయిమ్స్, ఐఐఎం, కోచ్ ఫ్యాక్టరీ కోసం నిలదీస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రధానిపై విమర్శించకూడదని రాజ్యాంగంలో వుందా అని ప్రశ్నించిన కేసీఆర్, ప్రధానిని విమర్శిస్తే జైలుకు పంపుతారా? బీజేపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని.. తనను ముట్టుకుంటే తెలుసుందని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో మా పార్టీ పనిచేస్తుందని కేసీఆర్ గుర్తు చేశారు. అమెరికా ట్రంప్ ప్రభుత్వం ఎలా నడుస్తుందో అలానే తమ ప్రభుత్వం నడుస్తుందన్నారు. రాష్ట్రంపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.
రాష్ట్రంపై దృష్టి పెడతామని అంటే తాము వద్దంటామా అని కేసీఆర్ అన్నారు. అంతిమ తీర్పు ప్రజలే ఇస్తారు. దాన్ని మేము ఆమోదిస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రధాని మోదీని తాను తప్పుబట్టలేదు. మోదీని గారు అని సంబోధించాను. అసంబద్ధమైన మాటలు మాట్లాడటం సరికాదని కేసీఆర్ హెచ్చరించారు. తన భాషను మార్చుకోవాల్సిన పనిలేదని, వాడు, వీడు.. అని మాట్లాడేనే కానీ మోదీని మాత్రం అనలేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు. తన వైఖరిలో మార్పులేదు. ఆ మాటలకు కట్టుబడి వున్నా. ఏపీ రాజకీయాలకు సంబంధించి మాత్రమే వాడూ వీడూ అని మాట్లాడానని కేసీఆర్ తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే ఎవరూ ఒరగబెట్టింది ఏమీ లేదని.. దేశ రాజకీయాల్లోమార్పు అవసరం వుందన్నారు. కాంగ్రెస్, బీజేపీతో ప్రజలు విసిగిపోయారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పడుతుందో లేదో కాలమే సమాధానం చెప్తుంది. కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీ వచ్చినా పథకాల పేర్లు మారుతున్నాయని కేసీఆర్ తెలిపారు. 2019లో కాంగ్రెస్‌కు పది సీట్లు కూడా రావని, బీజేపీకి ఉన్న సీట్లు కూడా రావని.. మొత్తం గల్లంతయ్యే పరిస్థితి వుందన్నారు. తెలంగాణలో బీజేపీ వుందా అనేది పెద్ద జోక్ అన్నారు.
కేంద్రంలోని పార్టీలు చెప్పేదొక్కటీ చేసేది మరొకటి. ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి ఉండకూడదని కేసీఆర్ తెలిపారు. ప్రజలను రాజకీయ నేతలు వంచిస్తున్నారని.. ప్రజలు వంచన నుంచి బయటపడాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు.
తన ఆరోగ్యం బాగుంటే ఆ పని తప్పకుండా చేస్తానని.. భవిష్యత్తులో దేశంలో మూడో ఫ్రంట్ రావచ్చని తెలిపారు. సీపీఎం నేత సీతారాం ఏచూరీతో ఇప్పటికే ఈ విషయమై మాట్లాడానని అన్నారు. భవిష్యత్తులో బీజేపీ పోయి మళ్లీ కాంగ్రెస్ వస్తే దేశంలో ఏదైనా మార్పు వస్తుందా? అని ప్రశ్నించారు. దేశంలో పరివర్తన అవశ్యకత ఉందని తెలిపారు.