సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైకాపాకు చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణంరాజు ఓ తేడా మనిషి అంటూ మండిపడ్డారు. పైగా, ఆయన్ను అసలు తాను మనిషిగా కూడా చూడనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంపై రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనకు ఎంతో అభిమానం ఉందని చెపుతూనే... పార్టీపై, పార్టీ నేతలపై ఆయన చేస్తున్న విమర్శలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
ముఖ్యంగా పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డిని ఆయన టార్గెట్ చేస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల జగన్‌కు ఆయన రాసిన లేఖలో కూడా... ఓవైపు స్వామి భక్తిని ప్రదర్శిస్తూనే... మరోవైపు తాను చేయాల్సిన విమర్శలన్నీ చేశారు. అలాగే, తణుకు వైకాపా ఎమ్మెల్యేపై కూడా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో తణుకు ఎమ్మెల్యే నాగేశ్వర రావు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. రఘురామకృష్ణంరాజు ఒక తేడా మనిషి అంటూ మండిపడ్డారు. ఆయనను తాను ఒక మనిషిగా కూడా గుర్తించడం లేదని చెప్పారు. ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారని... అందుకే ప్రధాని నరేంద్ర మోడీ భజన చేస్తున్నారని ఆరోపించారు.