అమెరికాలో తెలుగు విద్యార్థులు కొందరు సమస్యల్లో చిక్కుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ నుంచి చదువుతున్నట్టు పత్రాలు చూపించి ఆ దేశంలోని వేర్వేరు చోట్ల ఉండటంతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది విద్యార్థులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు మధ్యవర్తులగా వ్యవహరించిన ఎనిమిది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
చదువు పూర్తైనా నకిలీ యూనివర్సిటీ పేరు చెప్పి.. అమెరికాలోనే వుండిపోయిన తెలుగు విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ఉద్యోగం కోసం తాము నిజంగా చదవకపోయినా, చదువుతున్నట్టుగా పత్రాలు పొందడానికి డబ్బులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై 2015 నుంచీ ఆ రహస్య ఆపరేషన్ నిర్వహిస్తున్న అమెరికా పోలీసులు ఈ విషయాన్ని బహిర్గతం చేశారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు 17ఏళ్ల నుంచి బంధుత్వం వుందని కేఏ పాల్ మళ్లీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ట్రంప్ దగ్గర నుంచి తాను పైసా తీసుకోలేదని.. ట్రంప్‌ను గెలిపించడం కోసం ఎంతో పని చేశానని వివాదాస్పద కామెంట్లు చేశారు.
అమెరికాలో భారతీయుల ఇబ్బందుల పట్ల తన విజ్ఞప్తికి ట్రంప్ స్పందించారని కేఏ పాల్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌ను పోలా వైట్ తప్పుదోవ పట్టిస్తున్నారని, భారతీయుల పట్ల పోలా వైట్ తప్పుడు అభిప్రాయంతో ఉన్నారని పాల్ వెల్లడించారు. గ్రీన్ కార్డు సమస్యలు త్వరలో తొలగిపోతాయన్నారు. విద్యార్థులను కన్సూలెట్ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, హెచ్1 వీసాలు గతం లాగానే చేయాలని కేఏ పాల్ కోరారు.