Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యాయ, పాలనా వ్యవస్థలు పౌరులకు రక్షణ కవచాలు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

Advertiesment
న్యాయ, పాలనా వ్యవస్థలు పౌరులకు రక్షణ కవచాలు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
, మంగళవారం, 26 నవంబరు 2019 (21:54 IST)
విజయవాడ : న్యాయ, పాలనా వ్యవస్థలు ప్రజలకు రక్షణ కవచాల వంటివని, భారత రాజ్యాంగం దేశ పౌరులకు విభిన్న హక్కులను అందించిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. దేశ పౌరులు తమ హక్కులను సంరక్షించుకోవటమే కాకుండా, వారి బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించాలన్నారు. 
 
భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకుని 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించి, ప్రముఖుల సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
 
కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్, సివిఆర్ కళాశాల, తక్షశిల ఐఎఎస్ అకాడమీకి చెందిన విద్యార్ధులు పాల్గొనగా, గవర్నర్ బిశ్వ భూషణ్ విద్యార్ధులు, న్యాయమూర్తులు, ఆహ్వానితులతో రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక విధులపై ప్రతిజ చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ హరిచందన్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ పౌరులు అందరికి సమాన హక్కులు కల్పించిందని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసారు. 
 
దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదన్నారు. పౌరులు తమ ప్రాధమిక హక్కులకు భంగం కలిగితే న్యాయ స్ధానాలను ఆశ్రయించవ్చని, అదే క్రమంలో రాజ్యాంగ స్పూర్తిని మరువ రాదని వివరించారు. స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేపట్టిన అహింసా పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని యువత ముందడుగు వేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.  ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల కొరకు అనేది భారత రాజ్యాంగంలో కీలకమైన అంశం కాగా, దేశంలోని ప్రతి ఒక్కరికి రాజ్యాంగపరమైన హక్కులు, విధులు, బాధ్యతలు విస్పష్టంగా పొందుపరచబడ్డాయన్నారు. నవంబర్ 26ను 2015 వరకు న్యాయ దినోత్సవంగా నిర్వహించామని,  ఆ తర్వాత దీనిని రాజ్యాంగ దినోత్సవంగా పాటిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి వివరించారు. 
 
రాజ్యాంగం అయా వర్గాల ప్రజల కోసం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనే దానిని కూడా నిర్దేశించిందని,  ఈరోజును సంవిధాన్ దివస్ గా కూడా పిలుస్తున్నామని జితేంద్ర కుమార్ మహేశ్వరి వివరించారు. కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించి అంటరానితనం రూపుమాపేందుకు కృషి చేశారని ప్రశంసించారు. అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్ది, అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యమని, ఆ దిశగా పాలన సాగిస్తున్నారని వివరించారు.
 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని ఆకాంక్షించారు. బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపడం బాధ్యతగా భావించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), డిజిపి గౌతమ్ సవాంగ్, స్ధానిక శాసన సభ్యుడు మల్లాది విష్ణు, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి అర్జున రావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ , విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు, నగర ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్దానం నుండి గౌరవ న్యాయమూర్తులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ కొడుక్కి బుర్ర పనిచేయదు... కుక్కలు, పందులతో కలిసి తిరుగుతావా? మంత్రి కొడాలి ఫైర్