Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్న చిరు బాట‌లో త‌మ్ముడు ప‌వ‌న్? కాంగ్రెస్‌లో విలీనం అంటూ ప్రచారం?

Advertiesment
అన్న చిరు బాట‌లో త‌మ్ముడు ప‌వ‌న్?  కాంగ్రెస్‌లో విలీనం అంటూ ప్రచారం?
విజయవాడ , శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:54 IST)
అన్న చిరంజీవి ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్ లో వినీనం చేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. ఇపుడు త‌మ్ముడు ప‌వ‌న్ కూడా అదే బాట‌లో ప‌య‌నిస్తార‌ని రాజ‌కీయ ఊహాగానాలు  ఊపందుకుంటున్నాయి. పొలిటిక‌ల్ జంక్ష‌న్ థియ‌రీ ప్ర‌కారం 2024 క‌ల్లా వైసీపీ వ్య‌తిరేకులంతా ఒక జంక్ష‌న్ లో క‌ల‌వాల‌నే ప్లాన్ లో భాగంగా ఈ విలీనాలు జ‌రుగుతాయ‌నే అంచ‌నాల‌ను రాజ‌కీయ ప‌రిశీల‌కులు వివ‌రిస్తున్నారు. 
 
టార్గెట్ 2024... కాంగ్రెస్ లోకి జనసేన విలీనం? పవన్ కు కీలక పదవి ఆఫర్ అంటూ జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఇదే ఏపీ రాజకీయ చదరంగంలో మరో కీలక మార్పు అని సంకేతాలు వెలువడుతున్నాయి. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విడివిడిగా ప్రయత్నిస్తున్నా, సఫలం కాలేకపోతున్న జనసేన, టీడీపీ, కాంగ్రెస్ వంటి పక్షాలు ఏకమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందు కోసం జనసేన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై చేస్తున్న విమర్శల్లో రాష్ట్రాభివృద్దిని దృష్టిలో పెట్టుకునే పొత్తులు ఉంటాయని తేల్చిచెప్పేశారు కూడా.
 
ఏపీ రాజకీయాల్లోకి 2009లో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం యువరాజ్యం ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014 ఎన్నికల నాటికి సొంతగా జనసేన పార్టీ పెట్టారు. అయితే సమయం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీకి మద్దతు పలికి గెలిపించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల నాటికి మారిన పరిస్ధితుల్లో టీడీపీ, బీజేపీని వీడి మరోసారి కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటములతో పాటు పార్టీ కూడా కేవలం ఒక్కసీటుకే పరిమితం కావడం జనసేనానికి ఇబ్బందికరంగా మారిపోయింది. 
 
ఆ తర్వాత త‌న స్టాండ్ మార్చి బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. ఈ ప్రయోగం కూడా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో, ఇప్పుడు పవన్ మరోసారి పొలిటికల్ జంక్షన్ లో నిలబడి దిక్కులు చూస్తున్నారు. బీజేపీతో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఇరు పార్టీలు కలిసి ఎంతోకాలం ప్రయాణించడం సాధ్యం కాదనే విషయం తెలిసొచ్చింది. దీంతో విభిన్న అజెండాలు కలిగిన బీజేపీ, జనసేన పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు.

క్షేత్రస్దాయిలో పోరాటాలు సైతం విడివిడిగానే చేసుకోవాల్సిన పరిస్ధితుల్లో, త్వరలో బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు జనసేన సిద్దమవుతోంది. అయితే చివరి సారిగా పవన్ కళ్యాణ్ తాజాగా ఏపీ బీజేపీ ఛీఫ్ సోము వీర్రాజుతో నిన్న భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైకి మౌనంగా ఉంటున్నా, బీజేపీతో కలిసి సాగే పరిస్ధితులు లేవని పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
 
గతంలో 2014 ఎన్నికల్లో టీడీపీ పొత్తు పెట్టుకుని తాము స్వయంగా పోటీ చేయకుండా, ఆ పార్టీకి మద్దతు పలికిన జనసేన ఆ త‌ర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పేసింది. అయితే పరోక్షంగా వీరిద్దరూ సహకరించుకుంటున్నారనే ప్రచారం జరిగినా, ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగానే వచ్చాయి. దీంతో ప్రస్తుతానికి దూరంగా ఉంటున్న టీడీపీ, జనసేన త్వరలో పొత్తు పెట్టుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో కటీఫ్ చెప్పేసిన తర్వాత, టీడీపీతో పొత్తు దిశగా జనసేన అడుగులు వేయొచ్చనే ప్రచారం సాగుతోంది. దీంతో టీడీపీ, జనసేన కలిసి 2024 ఎన్నికలను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.
 
మరోవైపు ప్రస్తుతం జాతీయ పార్టీ అయిన బీజేపీకి గుడ్ బై చెప్పేయాలని దాదాపు నిర్ణయానికి వచ్చేసిన జనసేన పార్టీ, మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో జత కలిసేందుకు సిద్ధమవుతోంది. అదీ కాంగ్రెస్ లో జనసేన పార్టీని విలీనం చేస్తే ఎలా ఉంటుందనే దానిపై జనసేనాని పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జనసేనను విలీనం చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలు, రాష్ట్ర, జాతీయ స్ధాయిలో ఎదురయ్యే పరిస్దితులు వంటి వాటిని పవన్ బేరీజు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ వంటి బలమైన విపక్షం ఉన్నందున, కాంగ్రెస్ లో జనసేన విలీనం తర్వాత, దానితో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే దానిపైనా చర్చలు సాగుతున్నాయి.
 
గతంలో 2009 ఎన్నికల్లో భారీ ఆంచనాలతో బరిలోకి దిగిన చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత రెండేళ్లపాటు కొనసాగిన ప్రజారాజ్యం.. ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయింది. మొదట్లో విలీనం వార్తల్ని తోసిపుచ్చిన ప్రజారాజ్యం పార్టీ, ఆ తర్వాత తామే స్వయంగా ఆ విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు తమ్ముడు పవన్ కూడా అదే బాటలో కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం అయినప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉంది. ఇప్పుడు ఆ పరిస్దితులు లేవు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెల్చుకునే పరిస్దితుల్లో లేదు. అదే సమయంలో జనసేన పరిస్ధితి కూడా దాదాపు అలాగే ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ఒకవేళ కాంగ్రెస్ లో తన జనసేన పార్టీని విలీనం చేయాల్సి వస్తే, ఎలాంటి హామీలు తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది.
 
ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్దితి దయనీయంగా ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. పార్టీ పరిస్ధితి దారుణంగా ఉండటంతో బాధ్యతలు మోసేందుకు పార్టీలో మిగిలి వున్న నాయకులు కూడా సిద్ధం కావడం లేదు. గతంలో సీఎం పదవి అనుభవించిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కేంద్రమంత్రి పదవులు అనుభవించిన పల్లంరాజు, జేడీ శీలం వంటి నేతలు కానీ పీసీసీ ఛీఫ్ పదవి తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.

ఇలాంటి సమయంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ తన పార్టీ జనసేనను కాంగ్రెస్ లో విలీనానికి అంగీకరిస్తే మాత్రం, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు భవిష్యత్ సీఎం పదవి కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ హామీ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే, పవన్ కళ్యాణ్ ఈ ఆఫర్ అంగీక‌రించి పార్టీని కాంగ్రెస్ లో విలీనానికి సై అంటారా? లేదా? అనేది ముందు ముందు రాజ‌కీయ తెర‌పై వీక్షించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐస్ క్రీమ్ స్టిక్‌లపై ఇడ్లీలు.. చట్నీ, సాంబార్.. ఆనంద్ మహీంద్రా ట్వీట్