గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. వచ్చే నెల ఒకటో తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ జరుగనుండగా, నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో జనసేన కూడా జై కొడుతోంది. ఈ ఎన్నికల్లో 45 నుంచి 60 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్ తెలిపారు.
బీజేపీ, జనసేన మధ్య పొత్తు నేపథ్యంలో ఆ రెండు పార్టీలు కలిసే బరిలోకి దిగుతాయని భావించినప్పటికీ, రెండు పార్టీల మధ్య పొత్తు కేవలం ఏపీకే పరిమితమని, తెలంగాణలో వేర్వేరుగానే పోటీ పడనున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే, ఈ విషయంలో జనసేన నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్ కూడా నిన్న విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి బుధవారం 10.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబరు 1న ఓటింగ్ జరగనుండగా, 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే, అవసరమైన చోట 3న రీపోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగియనుండగా, బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగనున్నాయి.