Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోటీశ్వర మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లు ఎందుకు? పవన్ కళ్యాణ్

కోటీశ్వర మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్లు ఎందుకు? పవన్ కళ్యాణ్
, ఆదివారం, 31 మార్చి 2019 (17:44 IST)
ఆకలితో అలమటిస్తున్న పేదలకు పెన్షన్లు ఇస్తే ఒక పూట ఆకలి తీర్చుకుంటారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ, కోటీశ్వర మాజీ ఎమ్మెల్యేలు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శ్రీకాకుళంలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడుతూ, అమలు చేసేందుకు వీలు లేని పథకాలను టీడీపీ, వైసీపీలు ప్రకటించాయని, అలాంటి పథకాలను తాను ప్రకటించనని స్పష్టంచేశారు.
 
వందల కోట్లు, వేల కోట్లు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు పెన్షన్లు తీసుకుంటున్నారని, ఆ పెన్షన్‌తో వారికేమి అవసరం? దాన్ని కూడా వాళ్లు వదలరని దుయ్యబట్టారు. అన్నం పెట్టే రైతుకు మాత్రం ఏ ప్రభుత్వమూ పెన్షన్ ఇవ్వట్లేదని విమర్శించారు. రైతు కన్నీరు తెలిసిన వాడిని కనుక తమ పార్టీ అధికారంలోకి రాగానే పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. 
 
అదేవిధంగా, 58 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్యకారుడికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతికూల పరిస్థితుల్లో  ప్రజల పక్షాన నిలబడిన వాడే నిజమైన ‘నాయకుడు’ అని అన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలని యువత కోరుకుంటోందని, వారికి తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
 
ఇకపోతే, పులివెందులలో భూములు కొనాలంటే జగన్ మోహన్ రెడ్డి కుటుంబీకులు ఒప్పుకోరనీ, అడ్డుపడతారన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా వెళ్లి రాయలసీమ, పులివెందులలో వెళ్లి భూములు కొనగలరా? అని పవన్ ప్రశ్నించారు. కానీ పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తులు ఉత్తరాంధ్రలో బేలా భూములు కొనుగోలు చేసేందుకు స్థానిక ప్రజలు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు.
 
పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తులు ఉత్తరాంధ్రలో వేల ఎకరాలను లాగేసుకున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. 'ఇలాగే జరుగుతూ పోతే రేపు మనం భూములు లేక బానిసలుగా ఉండాల్సి వస్తుంది. వాళ్లకు ఊడిగం చేయాల్సి వస్తుంది' అని హెచ్చరించారు.
 
టీడీపీ గత ఐదేళ్లో రాష్ట్రాన్ని దోచేసిందనీ, రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలను తిరగనివ్వడం లేదని ఆయన విమర్శించారు. ఇక వైసీపీ పరిస్థితి కూడా అంతకంటే మెరుగ్గా ఏమీ లేదన్నారు. ఈ దోపిడీ సొమ్ములో అచ్చెన్నాయుడు 60 శాతం, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు 40 శాతం పంచుకుంటున్నారని పవన్ ఆరోపించారు. 
 
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేన‌ను గెలిపించాలని కోరారు. లేదంటే ఉత్తరాంధ్రను పట్టించుకునేవారే ఉండరని హెచ్చరించారు. శ్రీకాకుళం భాష, యాస, మాండలికంపై తనకు చాలా ప్రేమ ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్వీట్లు చేస్తోంది నేనే. దెయ్యం కాదు... సుష్మా స్వరాజ్