గత ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న వైకాపాకు ముగిసిన ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో కేవలం ఒక్కటే రావొచ్చు కదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎందుకంటే గతంలో మనకు కూడా ఒక్కటే వచ్చింది కదా అని గుర్తు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం పిఠాపురం జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
'వైకాపాకు 151 సీట్లు ఇచ్చి కాలం పరీక్ష పెట్టింది. వాళ్లు ఏదైనా చేసేయొచ్చు అనుకున్నారు. ఫలితం ఎదుర్కొన్నారు. ఈసారి 11 వచ్చాయి. రేపు ఒకటే రావొచ్చు. మనకి ఒకటి వచ్చినప్పుడు వాళ్లకూ రాకూడదని లేదుగా' అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు బై బై జగన్ అని నినదించగా.. ఒకసారి చెప్పేశాం కదా, ఎన్నిసార్లు చెబుతామని పవన్ ప్రశ్నించారు.
'బాబూ మీకు దండం పెడతా. వైకాపా నాకు శత్రువు కాదు. వారిలాగా మనమూ చేస్తే, వారికీ మనకూ తేడా ఏంటి? వ్యక్తిగత దాడులకు దిగొద్దు. క్రమశిక్షణ పాటించండి. ప్రజా సమస్యలపైనే మాట్లాడండి' అని కార్యకర్తలకు జనసేనాని హితవు పలికారు. 'మీరంతా సీఎం సీఎం అని అరిచి ప్రకృతిని, భగవంతుడిని భయపెట్టారు. కనీసం ఉప ముఖ్యమంతైనా కాకపోతే ఎలా అని ప్రకృతి కదిలిపోయింది. నేను డిప్యూటీ సీఎంనయ్యాను. కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. వేల కోట్లు కావాలి, రుషికొండ కావాలి, దేవాదాయ భూములు కొట్టేయాలంటే జరగదన్నారు. ఈ సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్, పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.