స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పరిస్థితిపై గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తమవుతుంది. జైలుతో పాటు జైలు పరిసరాల్లో అధిక ఉక్కపోత కారణంగా ఆయన డీహైడ్రేషన్‌కు గురయ్యారు. చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనను పరీక్షించి వైద్యులు ఈ మేరకు వైద్య నివేదికను అందజేశారు. అలాగే, ఏసీబీ కోర్టు ఆదేశం మేరకు ఆయన గదిలో ఏసీ టవర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై జైలు అధికారులు ప్రత్యేక బులిటెన్ విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు ఉన్న బ్యారక్‌లో ఏసీ టవర్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. చంద్రబాబు 67 కేజీల బరువు ఉన్నారని పేర్కొన్నారు.
కాగా, స్కిల్ కేసులో అరెస్టయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు... వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పులు వచ్చాయి. జైలు వైద్యాధికారితో పాటు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వైద్యులు కూడా చంద్రబాబును పరిశీలించారు. చంద్రబాబు ఆరోగ్యంపై కోర్టుకు నివేదిక సమర్పించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరమని వైద్యులు సిఫార్సు చేయగా, ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు ఏసీ సౌకర్యం అమర్చాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో జైలు అధికారులు ఏసీని అమర్చారు.