అమరావతి: విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై స్టేట్మెంట్ ఇవ్వకుండా ఏపీ పోలీసులను వైసీపీ అధ్యక్షుడు జగన్ కించపర్చారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఏపీ పోలీసుల సహకారం లేకుండానే రాష్ట్రంలో 3 వేల కిలో మీటర్లలో జగన్ పాదయాత్ర చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబునాయుడు నివాసం ఎదుట శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
'' 2007లో ఆపరేషన్ ధుర్యోదన సినిమా వస్తే, 2018లో ఆపరేషన్ గరుడు వచ్చింది. రాష్ట్రంలో 78 వేల మంది పోలీసులు నిరంతరం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. 200 నుంచి 300ల మంది పోలీసుల భద్రత నడుమ జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. కడపలో, హైదరాబాద్ లోని జగన్ నివాసం వద్ద కూడా ఏపీ పోలీసులే సేవలందిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.
ఏపీ పోలీసులను జగన్ అవమానించారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉన్న విమానాశ్రయంలో జగన్ పైన దాడి జరిగితే, ఏపీ పోలీసులను కించపర్చడం ఎంతవరకు సబబు? విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చింది... రక్తం కారుతుంటే జగన్‌ను ఎలా హైదరాబాద్‌కు వెళ్లనిచ్చారో తెలియాలి. జగన్ పైన దాడి ఘటనకు వైకాపా నేతలు సీబీఐ విచారణ కావాలంటున్నారు, ఇంటర్ పోల్ కూడా కావాలి అడుగుతారేమో. జగన్ దాడి ఘటన జరిగిన వెంటనే వైకాపా నేతలు దౌర్జన్యాలకు దిగారు. దాడి ఘటనపై విచారణ జరగాలి, వాస్తవాలు బయటకు రావాలి.
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న నవయుగపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,150 కోట్లు ఇంకా రావాల్సి ఉంది. డీపీఆర్-2కు ఇంకా కేంద్రం ఆమోదం తెలపలేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన 350 కేజీల బరువు కలిగిన బిల్లులను కేంద్రానికి పంపించాం. అయినా మీనమేషాలు లెక్కిస్తూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిధులు మంజూరు చేయడంలేదు. పోలవరం ప్రాజెక్టు మాదిరిగా దేశంలో మరే జాతీయ ప్రాజెక్టు పనులు వేగంగా సాగడంలేదు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాల''ని మంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు డిమాండ్ చేశారు.