ఏపీలోని పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జగనన్న గోరుముద్ద పథకం కింద అందించే ఆహారం ఫుడ్ పాయిజనింగ్ కావడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కనీసం 25 మంది పిల్లలు మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాల అధికారులు సరఫరా చేసిన ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జిల్లా కదిరి పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
148 మంది పిల్లల్లో 121 మంది శుక్రవారం తరగతులకు హాజరయ్యారని.. తమకు వడ్డించిన ఆహారం పాతబడిపోయిందని విద్యార్థులు వాపోయారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య విద్యార్థులకు తాజా ఆహారాన్ని సరఫరా చేయాలని క్యాటరింగ్ ఏజెన్సీని కోరారు. అయితే, తాజా ఆహారాన్ని వండడానికి ముందు, ఏజెన్సీ కొంతమంది విద్యార్థులకు భోజనం అందించింది. వారిలో కనీసం 25 మంది అస్వస్థతకు గురయ్యారు.
బాధిత విద్యార్థినులు వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతున్నారని ఫిర్యాదు చేశారు. మొదట ఎనిమిది మంది విద్యార్థులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మరో 17 మంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఎస్వీ కృష్ణారెడ్డి ఆస్పత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.
విద్యార్థులకు నాసిరకం భోజనం అందించడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారి హామీ ఇచ్చారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకం కింద కొత్త మెనూని నవంబర్ 21న ప్రవేశపెట్టారు. విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మెనూను మార్చింది.
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గతంలో కంటే మెరుగైన పౌష్టికాహారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజన ఏజెన్సీలు బియ్యం, కూరగాయల కూర, పప్పు సాంబార్, కోడిగుడ్డు కూర, చట్నీ మొదలైనవి లబ్ధిదారు విద్యార్థులకు వారానికి కనీసం మూడు ఉడికించిన గుడ్లు అందించబడతాయి.
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో పాఠశాల అధికారులు సరఫరా చేసే ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి.
కాంట్రాక్టు ఇచ్చిన క్యాటరింగ్ ఏజెన్సీలు తయారు చేస్తున్న ఆహార పదార్థాల నాణ్యత తక్కువగా ఉండడం, ఆహారాన్ని వండేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇందుకు కారణమని తెలుస్తోంది.