Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు ఢిల్లీకి జగన్‌.. ప్రధానితో భేటీపై సర్వత్రా ఆసక్తి

నేడు ఢిల్లీకి జగన్‌.. ప్రధానితో భేటీపై సర్వత్రా ఆసక్తి
, బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (06:34 IST)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారు.

ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్‌ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
 
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులను కేంద్రం విడుదల చేయడం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ప్రతిపాదించిన కేటాయింపులను పెంచడం, ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధన దిశగా ప్రక్రియను వేగవంతం చేయడం.. లక్ష్యాలుగా జగన్‌ ఢిల్లీలో పర్యటించనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు.

ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధనకోసం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీకి ఇటీవల లేఖ రాయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించనున్నారు. 
 
ప్రధానితో సీఎం భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఆ మేరకు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరనున్నారు.

జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున పోలవరం ప్రాజెక్టుకోసం సవరించిన అంచనాలకు పరిపాలన ఆమోదం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదించిన కేటాయింపులను పెంచాలని కూడా ప్రధానికి జగన్‌ నివేదిస్తారు.
 
ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాల్సిన ఆవశ్యకతను మరోసారి మోదీ దృష్టికి తీసుకెళతారు. విభజనతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటే పార్లమెంటు వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చడం ఒక్కటే మార్గమని ఆయన వివరిస్తారు.

రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యలను ప్రధానికి నివేదించి వీలైనంతగా నిధులు కేటాయించేలా సీఎం కోరనున్నారు. ప్రధానితో భేటీ అనంతరం సీఎం జగన్‌ రాష్ట్రానికి తిరుగు ప్రయాణమవుతారని అధికార వర్గాలు తెలిపాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ 'దిశ ఎఫెక్ట్‌'.. 7 నిమిషాల్లో అరెస్ట్‌