Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పేదరికం పోవాలంటే మంచి విద్య కావాలి: ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమంలో జగన్‌

Advertiesment
పేదరికం పోవాలంటే మంచి విద్య కావాలి: ‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమంలో జగన్‌
, బుధవారం, 27 మే 2020 (21:50 IST)
పేద విద్యార్థుల కోసం వివిధ పథకాల కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చు.. ‘నా రాష్ట్రంలో నా పిల్లల మీద నేను పెడుతున్న పెట్టుబడి’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించారు. పేదరికం పోవాలంటే ఉన్నత విద్య కావాలని, అదొక్కటే మార్గం అని ఆయన స్పష్టం చేశారు.

ఆ దిశలోనే పలు పథకాల అమలు చేస్తున్నామన్న ఆయన, స్కూళ్లలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ నాడు–నేడు చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా తొలి విడతలో 15,715 స్కూళ్లలో 9 సదుపాయాలు కల్పిస్తున్నామని, అవి వచ్చే జూలై నాటికి పూర్తవుతాయని చెప్పారు.

వచ్చే ఏడాది మరో 15 వేల స్కూళ్లలో సమూల మార్పులు చేస్తామని, ఆ తర్వాత ఏడాది మిగిలిన స్కూళ్లు, కాలేజీలలో నాడు–నేడు కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను బడికి పంపిస్తే వారి తల్లుల ఖాతాలో రూ.15 వేలు జమ చేస్తూ దే«శంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి కార్యక్రమం అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు.

ఒకేసారి 43 లక్షల తల్లుల ఖాతాల్లో రూ.6350 కోట్లు జమ చేశామని, ఆ మొత్తం కూడా బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో వేశామని తెలిపారు. అమ్మ ఒడి పథకంలో దాదాపు 82 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని గుర్తు చేశారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగా చదువుకుంటారని, అందుకే వారి మధ్యాహ్న భోజనంలోనూ సమూల మార్పులు చేశామని చెపారు.

పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ రోజుకో వెరైటీతో మెనూ అమలు చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులందరికీ ఈ ఏడాది మార్చి 31 వరకు ఫీజులు పూర్తిగా చెల్లిస్తూ ఒకేసారి రూ.4200 కోట్లు విడుదల చేశామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు. అందులో గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1880 కోట్లు కూడా చెల్లించామని ఆయన వివరించారు.

 
‘మన పాలన–మీ సూచన’ కార్యక్రమం మూడవ రోజున ‘విద్యా రంగం’పై మేధో మథనం జరిగింది. క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, నిపుణులు, తల్లిదండ్రులు అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు, నిపుణులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
వీడియో ప్రదర్శన:
సీఎం వైయస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత నవరత్నాలు ప్రకటన, రాజన్న బడిబాట మొదలు విద్యా రంగంలో చేపట్టిన కార్యక్రమాల వివరణ. నాడు–నేడు మనబడి కార్యక్రమంపై సీఎం ప్రసంగం, అమ్మ ఒడి పథకం, జగనన్న గోరుముద్ద పథకాలు. విద్యార్థుల స్పందన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌పై సీఎం ప్రసంగాలతో పాటు, విద్యార్థుల స్పందనలతో వీడియో ప్రదర్శించారు.
 
తమ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు విద్యా రంగం ఎలా ఉండేదన్నది ఒకసారి ఆలోచన చేస్తే కొన్ని ఆశ్చర్యకర పరిస్థితులు కనిపించాయని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తెలిపారు. తన సుదీర్ఘ పాదయాత్ర 3648 కి.మీ ప్రస్థానంలో చాలా గ్రామాల మీదుగా సాగిందని, అప్పుడు చాలా మంది చిన్న పిల్లలు తనతో కలిసి నడిచారని గుర్తు చేశారు. 

అప్పుడు వారికి పుస్తకాలు అందాయా అని ఆరా తీస్తే, అక్టోబరు, నవంబరు వరకు కూడా పుస్తకాలు అందలేదని తెలిసిందని, అదే విధంగా మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పని చేసే ఆయాలు చాలా మంది తమ సమస్యలు ప్రస్తావించారని చెప్పారు. వారికి ఏడెనిమిది నెలల నుంచి బిల్లులు ఇవ్వడం లేదని, ఆ ఇచ్చే రూ.1000 గౌరవ వేతనాలు కూడా చెల్లించడం లేదని ఆవేదన చెందారని గుర్తు చేశారు.
 
అధ్వాన్న స్థితిలో స్కూళ్లు,,
ఇంకా అధ్వాన్న పద్ధతిలో స్కూళ్లు ఉన్నాయని, వాటిలో బాత్‌రూమ్‌లు లేవని, ఒక వేళ ఉన్నా వాటిలో నీళ్లు లేవని, బిల్డింగ్‌లు బాగు చేయాలన్న ఆలోచన అసలు అప్పటి ప్రభుత్వానికి లేనే లేదని సీఎం పేర్కొన్నారు. టీచర్లు ఎంత మంది ఉండాలి అన్న దానిపై కూడా స్పష్టత లేదని, ఎందరు పిల్లలకు ఎంత మంది టీచర్లు ఉండాలి అన్న దాని ఆధారంగా వారిని రీఅపోర్షన్‌ చేసే పరిస్థితి లేదని, దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించలేని పరిస్థితి కొనసాగిందని అన్నారు.
 
అందువల్ల ఖర్చు ఎక్కువైనా సరే పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించాలని తల్లిదండ్రులు భావించే పరిస్థితి ఉండేదని, మరోవైపు ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ఉంటే, ప్రభుత్వ పాఠశాలలు తెలుగు మీడియంలోనే ఉన్నాయని గుర్తు చేశారు.
 
కాంపిటేటివ్‌గా ఉండాలి
పిల్లలు చదవాలి అంటే, కాంపిటేటివ్‌గా ఉండాలని, ముఖ్యంగా పేద పిల్లలు కాంపిటేటివ్‌గా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ‘భావి సమాజంతో మనం కాంపిటేటివ్‌గా ఉండాలంటే.. ఈరోజు మన కళ్ల ముందే కనిపిస్తా ఉన్నాయి. సెల్‌ఫోన్లు కనిపిస్తా ఉన్నాయి. ట్యాబ్స్‌ కనిపిస్తా ఉన్నాయి. కంప్యూటర్లు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ ఏ బటన్‌ నొక్కినా కూడా ఆ కంప్యూటర్లలో కనిపించేవి, ట్యాబ్‌లలో కనిపించేవి, ఆ ఫోన్లలో టెక్స్‌ట్‌ మెసేజ్‌లు అన్నీ ఇంగ్లిష్‌లోనే కనిపిస్తా ఉన్నాయి. ఈరోజే మనం వింటా ఉన్నాం.

రాబోయే రోజుల్లో డ్రైవర్లు లేని కార్లు రాబోతా ఉన్నాయి అని. డ్రైవర్‌లెస్‌ కార్లు వస్తున్నాయని ఈరోజే మనం వింటున్నాం. మన కళ్ల ముందే ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ మన పిల్లలను మాత్రం మనం తెలుగు మీడియమ్‌లో చదివించాలని, ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పంపించాలని అంటూ ఉన్నాం. ఇంగ్లిష్‌ మీడియమ్‌ వద్దూ అంటున్నాం. ఇంగ్లిష్‌ మీడియమ్‌ వద్దు అంటున్న ఈ పెద్దమనుషులు మాత్రం ఏ ఒక్కరూ కూడా వాళ్ల పిల్లలను తెలుగు మీడియమ్‌కు పంపించడం లేదు. ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే చదివిస్తున్నారు’.

‘కాంపిటేషన్‌లో పేదవాడు బతకాలంటే, వారు తమ కాళ్ల మీద బతికే పరిస్థితి రావాలంటే మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువు మాత్రమే’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
ఇది నా రాష్ట్ర పిల్లల మీద పెట్టుబడి:
‘నన్ను చాలా మంది అన్నారు. అమ్మ ఒడిలో అన్ని డబ్బులు పెడుతున్నానని, నాడు–నేడుకు ఇంత ఖర్చు పెడుతున్నాడు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటున్నాడు, వసతి దీవెన, విద్యా దీవెన అంటున్నాడు, ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నానని అన్నారు. వారందరికీయ నేను చెప్పేది ఒక్కటే. నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడతా ఉన్నాను’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
ఎందుకీ పరిస్థితి?
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో నిరక్షరాస్యులు 33 శాతం ఉండగా, దేశంలో అది 27 శాతం అని, ఆ విధంగా దేశ స్థాయి కంటే మనం వెనకబడి ఉన్నామని సీఎం గుర్తు చేశారు. ఇక ఇతర దేశాలతో పోల్చి చూసుకుంటే, ఇంటర్‌ తర్వాత ఎంత మంది పిల్లలు ఇంజనీరింగ్‌ వంటి కోర్సుల్లో చేరుతున్నారని.. బ్రిక్స్‌ దేశాలతో జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) చూస్తే.. రష్యాలో 82 శాతం ఎన్‌రోల్‌ అవుతుండగా, బ్రెజిల్‌లో 51 శాతం, చైనాలో కూడా దాదాపు అదే శాతం ఎన్‌రోల్‌ అవుతుండగా, భారత్‌లో మాత్రం కేవలం 25.8 శాతం మాత్రమే ఎన్‌రోల్‌ అవుతున్నారని వెల్లడించారు. అంటే 74 శాతం విద్యార్థులు అక్కడితోనే చదువు ఆపేస్తున్నారన్న ఆయన, ఈ పరిస్థితి. చదవడం ఇష్టం లేక కాదని, కేవలం ఆ ఫీజులు తల్లిదండ్రులు కట్టలేక చదువు మానిపిస్తున్నారని చెప్పారు.
 
ఆ తండ్రి వేదన మర్చిపోలేను:
ఈ సందర్భంగా ప్రజా సంకల్పయాత్రలో చోటు చేసుకున్న ఒక ఘటనను సీఎం వైయస్‌ జగన్‌ మరోసారి ప్రస్తావించారు.
‘నా పాదయాత్ర నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగుతుండగా, ఒక ఇంటి ముందు ఒక పిల్లవాడి ఫ్లెక్సీ పెట్టి ఉంది. ఆ ఇంటి యజమాని గోపాల్‌ వచ్చి కలిశాడు. ఆ పేరు, ఆయన బాధ ఎప్పటికీ మర్చిపోలేను. గోపాల్‌ వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ ఫ్లెక్సీ ఎవరిదని అడిగాను. అది తన కొడుకుది అని, తాను బాగా చదివే వాడని, అందుకే సీటు వస్తే ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందని, అప్పుడు తన కొడుకు నాన్నా.. ఏం చేస్తావని అడిగాడు.

ఏదో ఒకటి చేస్తానని చెప్పి చేర్పించాను. మొదటి ఏడాది చదువు పూరై్తన తర్వాత ఇంటికి వచ్చాడు. రెండో ఏడాది ఫీజు ఎలా కడతావని అడిగితే, ఏదో ఒకటి చేస్తానని చెప్పాను. ఆ తర్వాత కాలేజీకి వెళ్లిన తన కొడుకు, ఫీజు చెల్లించడం కోసం నేను అప్పులపాలు కావొద్దన్న దిగులుతో ఆత్మహత్య చేసుకున్నాడని గోపాల్‌ చెప్పాడు’.
 
దిస్‌ వాట్‌ ఛేంజ్‌ ది లైఫ్‌ ఆఫ్‌ పీపుల్‌:
పేదవాడు ఆ పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడంటే, ఈ కుటుంబం నుంచి ఒకరు ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఉన్నత చదువులు చదవాలి అని సీఎం పేర్కొన్నారు. అప్పుడు వారు మంచి ఉద్యోగం చేసి ఇంటికి ఎంతొ కొంత పంపితే, ఆ కుటుంబాలు బాగు పడి, పేదరికం నుంచి బయటపడతాయని చెప్పారు. ఆ పిల్లల జీవితాలు కూడా బీపీఎల్‌ నుంచి మధ్య తరగతికి ఎదుగుతాయని, అలా చదివించలేకపోతే ఆ పిల్లలు ఎప్పటికీ పేదరికంలోనే ఉండిపోతారని అన్నారు.

పేదరికానికి దేర్‌ ఈజ్‌ నో సొల్యూషన్‌. పేదరికానికి ఉన్న ఏకైక సొల్యూషన్‌ ఉన్నత విద్య. దిస్‌ వాట్‌ ఛేంజ్‌ ది లైఫ్‌ ఆఫ్‌ పీపుల్‌ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
 
మార్పులకు శ్రీకారం:
ఇవన్నీ మార్పు తీసుకు రావాలి అంటే మొట్టమొదటి స్టేజ్‌ నుంచి మార్పు తీసుకురావాలన్న ఆయన, రాష్ట్రంలొఓ దాదాపు 45 వేల స్కూళ్లు అన్నీ తెలుగు మీడియమ్‌లో ఉన్నాయని, ఆ భవనాలు కూడా దాదాపు శిధిలావస్థలో ఉన్నాయని చెప్పారు. వాటిలో బాత్‌రూమ్‌లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లలు అక్కడకు పోతున్నారని చెప్పారు. 
 
ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవాలి అంటే ప్రైవేటు స్కూళ్లకు పోవాలని, కానీ ఫీజు కట్టలేని పరిస్థితి నెలకొందని, అందుకే ఈ టోటల్‌ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
 
నాడు–నేడు:
‘రాష్ట్రంలో దాదాపు 47,656 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వాటన్నింటి రూపురేఖలు పూర్తిగా మార్చడం కోసం నాడు–నేడు కార్యక్రమం ప్రారంభించాం. తొలి విడతగా 15,715 స్కూళ్లలో మార్పులు చేస్తున్నాం. ఈ జూలై నాటికల్లా ఆ స్కూళ్ల రూపురేఖలు మార్చాలని నిర్ణయం. ప్రతి స్కూళ్లో 9 రకాల సదుపాయాలు కచ్చితంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం’.
 
‘ప్రతి స్కూల్‌లో టాయిలెట్లు, మంచినీటి (క్లీన్‌ డ్రింకింగ్‌) సదుపాయాలు, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, ఫర్నీచర్‌ (కొత్త బల్లలు), పెయింటింగ్‌ ఫినిషింగ్, ప్రహరీ, ఇంగ్లిష్‌ మీడియమ్‌ ల్యాబ్‌ వంటి 9 రకాల సదుపాయాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ జూలై నాటికి 15,715 స్కూళ్లలో రూపురేఖలు మారుతాయి. వచ్చే ఏడాది మరో 15 వేల స్కూళ్లు, కాలేజీలు, ఆ తర్వాత ఏడాది మిగిలిన వాటి రూపురేఖలు మార్చబోతున్నాం’ అని సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు.
 
అమ్మ ఒడి:
‘ఇవన్నీ చేస్తూ నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను బడికి పంపించే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి పథకం అమలు చేస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతికి ముందుగా జనవరి 9వ తేదీన 43 లక్షల తల్లుల ఖాతాల్లో, దాదాపు 82 లక్షల మంది పిల్లలు 1 నుంచి 12 వరకు చదువుకుంటున్న వారికి మేలు జరిగేలా ఒకేసారి రూ.6350 కోట్లు ఒకేసారి ఆ తల్లుల ఖాతాల్లో జమ చేశాం. ఆ డబ్బు కూడా బ్యాంకులు పాత బాకీల కింద జమ చేయకుండా, అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో వేశాం’.
 
‘ఆ విషయం బ్యాంకులకు కూడా ముందే చెప్పాం. ఆ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నాం. అప్పుడు ఒక మాట చెప్పాను. వచ్చే ఏడాది ఈ మొత్తం తీసుకోవాలంటే పిల్లలకు కనీసం 75 శాతం హాజరు ఉండాలని చెప్పాం. వచ్చే ఏడాది కూడా జనవరి 9న ఆ మొత్తం ఇస్తాం. అందుకే 75 శాతం హాజరు కచ్చితంగా ఉండాలని చెప్పాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
 
విద్యా కానుక:
‘పిల్లలు ఇంకా బాగా చదవాలని, ఆగస్టు 3న పాఠశాలలు తెరిచేరోజు జగనన్న విద్యా కానుక ఇస్తున్నాం. ఒక స్కూల్‌ బ్యాగ్‌లో మూడు జతల యూనిఫామ్, వాటికి కుట్టుకూలీ, బెల్టు, షూస్, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌ పెట్టి ఇస్తాం. దీనికి దాదాపు రూ.660 కోట్లు ఖర్చవుతున్నా వెనుకాడకుండా అమలు చేస్తున్నాం’ అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడించారు.
 
పిల్లలకు పౌష్టికాహారం:
‘పిల్లలు స్కూల్‌ను ఓన్‌ చేసుకోవాలి. అందుకే వారి ఆహారంపై దృష్టి పెట్టాం. అందుకు మొదట చేసిన పని ఆయాల జీతం పెంపు. రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచాం. వారి జీతాలు కానీ, సరుకుల బిల్లులు కానీ ఏదీ ఆలస్యం కాకుండా గ్రీన్‌ ఛానల్‌లో పెట్టించాము. పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలన్న మెనూపై గతంలో ఏ సీఎం కూడా ఆలోచించని విధంగా నేను ఆలోచన చేస్తే విద్యా శాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు’.
 
‘దాదాపు 20 రోజులు కసరత్తు చేసి మెనూ ఖరారు చేశాం. అందుకు డైటీషియన్లతో కూడా మాట్లాడాం. ఒకరోజు పులిహోర, ఒకరోజు వెజిటబుల్‌ రైస్, ఒకరోజు బెల్లం పొంగలి, ఒకరోజు కిచిడీ, చిక్కీలు ఇస్తూ.. దానికి జగనన్న గోరుముద్ద అని చెప్పి జనవరి 21న ప్రారంభించాం. దీనికోసం అదనంగా ఏటా రూ.465 కోట్లు ఖర్చైనా అమలు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
ఇంకా పిల్లలు ఇంటర్‌ తర్వాత చదువులు చదివించే కార్యక్రమంలో భాగంగా ఏం చేయాలని ఆలోచించామని, కనీసం మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ కూడా లేదని తెలియడంతో, ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా మార్చాలని నాడు–నేడులో చేర్చామని తెలిపారు.

పూర్తి ఫీజుల చెల్లింపు:
గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) పెంచడం కోసం ప్రక్షాళన చేపట్టామని చెప్పారు. అందులో  భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టామని, అప్పుడు ఒక విచిత్ర పరిస్థితి వచ్చిందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం రూ,.1880 కోట్లు ఫీజు బకాయి పెట్టిందని, దాంతో పాటు, ఈ ఏడాది మార్చి 31 వరకు ఒకేసారి దాదాపు రూ.4200 కోట్లు ఇచ్చామని వెల్లడించారు.

దీని వల్ల దాదాపు 10 లక్షల బీసీలకు రూ.1800 కోట్లు, దాదాపు 4 లక్షల ఎస్సీలకు రూ.800 కోట్లు, దాదాపు 80 వేల ఎస్టీలకు రూ.130 కోట్లు, దాదాపు 1.45  లక్షల మైనారిటీలకు రూ.300 కోట్లకు పైగా, దాదాపు 3.5 లక్షల ఇతర విద్యార్థులకు దాదాపు రూ.1200 కోట్లు, బకాయి పడిన పిల్లలతో కలిపి చూస్తే దాదాపు 19 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.4200 కోట్లు మేలు చేశామని సీఎం వెల్లడించారు.

దీంతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో మొదటి త్రైమాసికం పూర్తి కాగానే పిల్లల తల్లుల ఖాతాలో ఫీజు మొత్తం వేస్తామని తెలిపారు. అప్పుడు ఆ తల్లి ఆ కాలేజీకి వెళ్లి వసతులు చూసి, విద్యాబోధనపై ఆరా తీశాకే ఫీజులు చెల్లించాలని కోరారు. ఆ కాలేజీలో వసతులు, విద్యాబోధన బాగా లేకపోతే  ఫోన్‌ చేయాలని అన్నారు. వచ్చే సెప్టెంబరు నుంచి ఈ విద్యా దీవెన కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
 
వసతి దీవెన:
‘ఇక వసతి దీవెన. కాలేజీల్లో చదివే పిల్లలకు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ఏటా రూ.20 వేల వరకు ఇస్తాం. ఇది కూడా రెండు దఫాల్లో తల్లుల ఖాతాల్లో వేస్తాం. తొలి రూ.10 వేలు జనవరి, ఫిబ్రవరిలో.. ఆ తర్వాత మిగిలిన రూ.10 వేలు సెప్టెంబరులో చెల్లిస్తాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
 
కరికులమ్‌ మార్పు:
కరికులమ్‌లో కూడా మార్పులు చేస్తున్నామన్న సీఎం, చదువు పూర్తయ్యే సరికి ఉపాధి లభించేలా ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని తెలిపారు. కోర్సులు యథావిథిగా 3 ఏళ్లు, నాలుగేళ్లు ఉంటాయన్న ఆయన, అయితే చివరి సెమిస్టర్, వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్‌ ఉంటుందని వివరించారు.

వైయస్సార్‌ కంటి వెలుగు:
ఈ ఏడాది తనకు చాలా సంతోషం కలిగించిన పని వైయస్సార్‌ కంటి వెలుగు అని ముఖ్యమంత్రి తెలిపారు. గత ఏడాది అక్టోబరులో ఈ కార్యక్రమం మొదలు పెట్టి మొత్తం 70,41,988 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేశామని, వారిలో 1.58 లక్షల మంది పిల్లలకు కంటి అద్దాలు అవసరం కాగా, ఇప్పటికే 1.29 లక్షల మంది పిల్లలకు పంపిణీ చేశారని చెప్పారు.

కోవిడ్‌ వల్ల ఆ పంపిణీ ఆగిపోయిందన్న ఆయన, త్వరలోనే అవి కూడా పంపిణీ చేస్తారని చెప్పారు. అదే విధంగా 46 వేల మంది పిల్లలకు ఆపరేషన్లు చేయాల్సి ఉందని,  వారికి స్కూళ్లు తెరిచిన తర్వాత ప్రభుత్వమే ఫ్రీగా ఆపరేషన్లు చేయిస్తుందని వివరించారు.
 
చివరగా, ‘ప్రతి పేద ఇంట్లో చదువుల దీపాలు వెలగాలి. మీ బిడ్డ ఇంకా బాగా మీకు ఉపయోగపడాలి. ఆ విధంగా దేవుడి దయ ఉండాలని కోరుకుంటూ, మీ సలహాలు కోరుతున్నాను. అవసరమైతే వ్యవస్థలో మార్పులు చేస్తాను’ అంటూ సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు: మంత్రి కురసాల కన్నబాబు