Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Advertiesment
జగన్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:58 IST)
ఏపీలో రైతు రుణమాఫీకి జగన్‌ ప్రభుత్వం మంగళం పాడింది. గత ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా 4, 5 విడతల సొమ్ము విడుదలకు సంబంధించిన జీవో 38 ని రద్దు చేస్తూ వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య జీవో 99 విడుదల చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని చేపట్టనున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ పథకాన్ని రద్దు చేశారన్నది స్పష్టమవుతోంది. 4, 5 విడతల రైతు రుణమాఫీకి సంబంధించిన సొమ్మును 10 శాతం వడ్డీతో కలిసి దాదాపు 31 లక్షలా 45 వేల రైతులకు 8 వేల 2 వందల కోట్లు విడుదల చేస్తూ మార్చి 10న టీడీపీ ప్రభుత్వ జీవో 38 విడుదల చేసింది.

అందులో కొందరు రైతుల అకౌంట్లలో అప్పట్లో 259 కోట్ల రూపాయలు జమ చేశారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో నిధుల చెల్లింపులు నిలిచిపోయాయి. అలా 31 లక్షల మంది రైతులకు 7వేల 582 కోట్లు జమ కాకుండా ఆగిపోయాయి.

ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రైతుల రుణమాఫీని పూర్తి చేయాలని రైతు సంఘాలు, ప్రతిపక్ష నేతలు సీఎం జగన్‌ను కోరారు. కానీ టీడీపీ ప్రభుత్వ హామీని తాము అమలు చేసేదిలేదని… ఆ పథకాన్ని రద్దు చేస్తామని జగన్‌ ప్రకటించారు. దీనిపై కొందరు హైకోర్టుకు కూడా వెళ్లారు.

అయితే పథకం అమలులో ఉంటే రుణమాఫీ వర్తింపచేయాలని కోర్టు సూచించింది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా 4, 5 విడత రుణమాఫీ ప్రక్రియ ఉత్తర్వులను రద్దు చేసింది. 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు… ఒక్కో రైతుకు లక్షన్నర చొప్పున రుణమాఫీ చేస్తామని అప్పట్లో ప్రకటించారు.

ఆర్థిక ఇబ్బందుల్లోనూ 55 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు 24 వేల 5 వందల కోట్లు మాఫీ చేస్తామన్నారు బాబు. అందులో భాగంగానే తొలి విడత 50 వేల లోపు ఏకమొత్తంగా మాఫీ చేశారు. అందులో 55 లక్షల మంది రైతులకు 7 వేల 565 కోట్లు మాఫీ చేశారు. అలాగే ఉద్యానవన రైతులకు 385 కోట్లు ఇచ్చారు.

మిగిలిన రుణాన్ని మరో 4 విడతలుగా మాఫీ చేసేందుకు రైతు సాధికార సంస్థ ద్వారా రుణ ఉపశమన పత్రాలైన బాండ్లు జారీ చేశారు. తొలివిడతలో 50 వేలు మూఫీ చేశాక 2, 3 విడతల కింద 10 శాతం వడ్డీతో కలిసి 7 వేల కోట్ల రూపాయలు జమచేశారు. ఇలా మూడు 3 విడతల్లో దాదాపు 16 వేల 5 వందల కోట్లు రుణమాఫీ లబ్ది రైతులకు దక్కింది.

తర్వాత నిధుల కొరత వల్ల మిగిలిన నిధుల జమ ఆలస్యమైంది. ఎన్నికలు దగ్గరకొచ్చేయడంతో 4, 5 విడతల సొమ్ము ఒకేసారి మాఫీ చేసే ఉద్దేశంతో మార్చి 10న జీవో 38 ఇచ్చిన ప్రభుత్వం 10 శాతం వడ్డీతో కలిపి 8 వేల 2 వందల కోట్లు విడుదల చేసింది. అందులో 22 వేల మంది రైతులకు 259 కోట్ల చెల్లింపులు జరిగాయి.

ఈ లోగా ఎన్నికల కోడ్‌ రావడంతో బ్యాంకర్లు జమ చేయడం నిలిపేశారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ఏకంగా జీవోనే రద్దు చేయడంతో 31 లక్షల మంది రైతులకు 7 వేల 582 కోట్లు దక్కకుండా పోయాయి. రైతు రుణమాఫీ జీవో రద్దు చేసి వైఎస్సాఆర్‌ రైతు భరోసా అమలుకు సిద్ధమైన జగన్‌ ప్రభుత్వంపై ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

జగన్‌ మీరు మరో స్టిక్కర్‌ సీఎం కాకండి అంటూ… కన్నా ట్వీట్‌ చేశారు. మ్యానిఫెస్టోలో రైతులకు 12 వేల 5వందల ఇస్తామని ప్రకటించిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు.

కానీ రైతులకు మోదీ ఇస్తున్న 6 వేలను కలుపుకుని వైఎస్సార్‌ భరోసాగా కేంద్రం రైతులకు ఇచ్చేదానిపై బాబు లాగా మీరు స్టిక్కర్‌ వేయడం తప్పని చురకలంటించారు కన్నా. రైతు భరోసాకు మోదీ పేరు పెట్టండని ట్విట్టర్‌లో సెటైర్‌ వేశారు కన్నా లక్ష్మీనారాయణ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిమాండ్ లేక ఆటోపరిశ్రమ విలవిల!