Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదవ తరగతి పరీక్షల్లో సమూల మార్పులు.. విద్యాశాఖ మంత్రి

పదవ తరగతి పరీక్షల్లో సమూల మార్పులు.. విద్యాశాఖ మంత్రి
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:50 IST)
ఈ విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి పరీక్షల్లో సమూల మార్పులు చేయనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

గురువారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, పదవ తరగతి ప్రశ్నా పత్రంలో మార్పులో భాగంగా బిట్ పేపర్ ను తొలగించి ప్రశ్నాపత్రంతోనే అనుసంధానించడం జరిగిందని, అంతేగాకుండా పరీక్షా సమయాన్ని 10 నిమిషాలు ప్రశ్నాపత్రం చదువుకొనుటకు, 5 నిమిషాలు పొందుపరిచిన జవాబులను తనిఖీ చేసుకోవడానికి వెరసి 15 నిమిషాలు రెండున్నర గంటలకు అదనంగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.

పదవ తరగతి ప్రశ్నా పత్రంలో ప్రశ్నా విధానాలను నాలుగు విభాలుగా రూపొందించడం జరిగిందని, అందులో  వ్యాసరూప ప్రశ్నలకు 20 మార్కులు(4x5=20), లఘు సమాధాన ప్రశ్నలకు 16 మార్కులు(8x2=16), సూక్ష్మ లఘు సమాధాన ప్రశ్నలకు 8 మార్కులు (8x1=8) అతి సూక్ష్మ లఘు సమాధాన ప్రశ్నలకు (12x1/2=6) పొందపరచడం జరిగిందన్నారు.

బిట్ పేపర్ ను అదనంగా ఇచ్చుట నిలుపుదల ద్వారా పారదర్శకత మరియు నాణ్యత పెంచుటకు అవకాశం ఏర్పడుతుందన్నారు. జవాబు పత్రాలకు  సంబంధించి విడివిడిగా కాకుండా ఒకేసారిగా 18 పేజీలతో కూడిన బుక్ లెట్ ను అందించడం జరుగుతుందన్నారు.

దీనికి సంబంధించి అవగాహనకై  ప్రశ్నా పత్రాలను, పరీక్షా విధానాలను అందరికీ అందజేయడం జరుగుతుందని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. మూల్యాంకనానికి సంబంధించి సమగ్రంగా చేపట్టేదానికై ఒక కంప్యూటర్ సంస్థను ఎన్నిక చేయడం జరుగుతుందన్నారు.

ఎన్నికకై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ , ఫైనాన్స్ సెక్రటరీ, విద్యాశాఖ కమిషనర్ తదితరులతో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మార్కుల జాబితా తడిచినా చినుగుటకు ఆస్కారం లేకుండా అందజేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 
 
పాఠశాల అభివృద్ధి కమిటీలకు సంబంధించి మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 46,635 పాఠశాలలకు గానూ 45,390 పాఠశాలలకు ఎంపిక పూర్తి చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి “మన బడి - మన బాధ్యత”(నాడు-నేడు) గా నామకరణం చేయడం జరిగిందన్నారు.

“మన బడి - మన బాధ్యత” అనే ట్యాగ్ లైన్ తో గతంలో మన బడి ఎలా ఉంది ? మన బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి అన్న అంశాన్ని ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. దసరా సెలవుల తర్వాత ఇందుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్రం మొత్తం మీద 5 చోట్ల చెదురుముదురు సంఘటనలు జరగడం మినహా ప్రశాంత వాతావరణంలో తల్లిదండ్రుల కమిటీలను ఎన్నుకోవడం జరిగిందన్నారు. మిగిలిన 3.6 శాతం పాఠశాలల్లో ఈనెల 28 తేదీనాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్రం మొత్తం మీద 35,855 పాఠశాలల యందు ఏకగ్రీవంగా తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక జరిగిందన్నారు. 1,175 పాఠశాలల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడిందన్నారు. ఎన్నిక కాబడిన తల్లిదండ్రుల కమిటీలకు అక్టోబర్ నెలాఖరులోగా శిక్షణనివ్వడం జరుగుతుందన్నారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల కమిటీకి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగిందని ఆయన అన్నారు.

కమిటీల ద్వారా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలల్లో ప్రవేశపెట్టే ప్రభుత్వ పథకాలు అమ్మఒడి, ఏకరూపదుస్తుల పంపిణీ(యూనిఫాం), పాఠ్యపుస్తకాలు, బూట్లు, స్కూలు బ్యాగ్ లు, సైకిళ్లు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ తరగతులు, కెరియర్ కౌన్సెలింగ్ కు సంబంధించి పలు అంశాలపై తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షణలో స్వచ్ఛంధంగా అమలు చేయుటకు మరియు స్వచ్ఛంధంగా భాగస్వామ్యం చేయడం జరుగుతుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ-విజయవాడ మధ్య ఉదయ్ పరుగులు