దాదాపు రెండు వారాలుగా జరుగుతున్న పంపిణీ ప్రక్రియ ఇప్పటివరకు 39శాతమే పూర్తైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. దీంతో పేదలకు ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. లబ్ధిదారుడి చేతికే నేరుగా ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి పేదవాడికి పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు.
ఇక పెండింగ్ లో ఉన్న ఇళ్లస్థలాల అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లకు జగన్ సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతి కాలనీ వెలుపల హైటెక్ పద్ధతిలో బస్ స్టాప్ నిర్మించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాల మ్యాపింగ్, జియో ట్యాగింగ్ కూడా ఏకకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఇంటి స్థలం లేని అర్హులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న సీఎం.., అర్హులైన పేదలకు ఇంటిస్థలం రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం లబ్ధిదారులకు మూడు ఆఫర్లు ఇచ్చింది:
ఆప్షన్ 1. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు లబ్ధిదారుల చేతికి ఇస్తుంది. మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు.
ఆప్షన్ 2. నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. బేస్‌మెంట్‌కి కొంత, పిల్లర్స్‌కి కొంత, స్లాబ్‌కి కొంత, ఇలా విడుతల వారీగా నిధులు మంజూరు చేస్తారు.
ఆప్షన్ 3. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.