జగన్ ఇలాకా పులివెందులలో గౌతమీపుత్ర శాతకర్ణికి ఎదురుదెబ్బ.. ఏం జరిగిందంటే?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాకా పులివెందులలో నందమూరి హీరో బాలకృష్ణ వందో సినిమా.. గౌతమీపుత్ర శాతకర్ణికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రులు గర్వించదగిన రాజు శాతకర్ణి జీవిత కథ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలాకా పులివెందులలో నందమూరి హీరో బాలకృష్ణ వందో సినిమా.. గౌతమీపుత్ర శాతకర్ణికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రులు గర్వించదగిన రాజు శాతకర్ణి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కడప జిల్లాలోని పులివెందుల పట్టణంలో అనూహ్యంగా అవమానం ఏర్పడింది.
శాతకర్ణి ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద అభిమానులు ఏర్పాటుచేసిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దాంతో పట్టణంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. ఫ్లెక్సీలు తొలగించినందుకు నిరసనగా హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆందోళన నిర్వహించారు. అయితే పోలీసులు అప్రమత్త చర్యలు తీసుకున్నారు.
ఇదిలావుంటే, 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా అభిమానులకు తాను అందించిన సంక్రాంతి కానుక అని చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సాధించిన విజయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సాధించిన విజయమని, ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నానని బాలకృష్ణ అన్నారు.
సంక్రాంతి బరిలో విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి ఘన విజయం సాధించడంతో హీరో నందమూరి బాలకృష్ణ ఆనందోత్సాహాల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొమరవోలు, నిమ్మకూరులో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. నందమూరి తారకరామారావు, బసవతారకం దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.