Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు భాషను బహిష్కరించామా?: అంబటి రాంబాబు ప్రశ్న

Advertiesment
తెలుగు భాషను బహిష్కరించామా?: అంబటి రాంబాబు ప్రశ్న
, శనివారం, 28 డిశెంబరు 2019 (18:17 IST)
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభలు జరగటం కొత్త ఏమీ కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు.

2007, 2008, 2015లో తెలుగు మహాసభలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు 4వ మహాసభలు విజయవాడలో మూడు రోజుల పాటు జరుగుతున్నాయని అంబటి తెలిపారు. దీనికి మంచి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ఆయన అన్నారు. తెలుగు భాష మీద అందరికీ మమకారం ఉంటుందన్నారు.

తెలుగు భాష తల్లిలాంటి భాష, మన మాతృభాష. దాన్ని గౌరవించాలి. దాన్ని ప్రేమించాలి. దాన్ని ఆరాధించాలి. దీంట్లో ఎవ్వరికీ ఎలాంటి సందేహం లేదని అంబటి అన్నారు. అయితే నిన్న ప్రపంచం తెలుగు రచయితల సభ జరిగిన తీరు.. కొంతమంది మాట్లాడిన మాటలు పత్రికల్లో చూసినప్పుడు ఆ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని, మమ్మల్ని విమర్శలు చేయటం బాధ కలిగించిందని అంబటి రాంబాబు అన్నారు.
 
 "ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆహ్వానం మేరకు ప్రపంచంలో అనేక మంది తెలుగు కవులు, నిష్ణాతులు హాజరయ్యారు. ఉపన్యాసాలు చెప్పారు. వారు తెలుగు సాహిత్యానికి చేసిన సేవ కొనియాడదగింది. వారిని చాలా గౌరవించాల్సిన అవసరం తెలుగు ప్రజలకు ఉందనటంలో మాకు ఎలాంటి సందేహం లేదు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం జరుగుతున్న వేదికపై.. టీడీపీ నేతలు పచ్చ కండువాలు తీసి తెల్ల కండువాలు వేసుకొని కనిపించారు.

వారు కానీ, కొందరు మాట్లాడిన మాటలు చూస్తే వారికి మాత్రమే తెలుగు మీద ప్రేమ ఉన్నట్లు మిగతా వారికి ప్రేమలేనట్లు ముఖ్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుగు అంటే గౌరవం లేనట్లు మాట్లాడారు. దానికి ప్రధాన కారణం వచ్చే సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే.

ఈ నిర్ణయం తెలుగు భాషను బహిష్కరించినట్లు, తెలుగు భాషను రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదన్నట్లు, తెలుగు భాష ఎవ్వరూ చదువుకోవటానికి వీల్లేదన్నట్లు కొంతమంది చిత్రకరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ విపణిలో ప్రపంచస్థాయిలో నిలబడాలనే సదుద్దేశంతో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంటే తెలుగు భాషకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్లు ఎందుకు భావిస్తున్నారో అర్థం కాలేదని" అంబటి రాంబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
 
"విమర్శలు చేసేవారు, వారి పిల్లలు, వారి మనవళ్లు ఏ భాషలో చదువుకుంటున్నారంటే ఇంగ్లీషు మీడియంలో. అది మంచిదే. ప్రతి వారి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటుంటే.. ఎందుకు కాదంటున్నారని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పామని అన్నారు.
 
 66 ఏళ్ల క్రితం రాష్ట్రం ఏర్పాటు అయితే పేదవాడు, బడుగు బలహీనవర్గాల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువులు చదువుకోలేక వెనుకబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పేదవాడు కూడా ఇంగ్లీషు మీడియం చదువుకోవాలి. ఉన్నత చదువుల్లోకి వెళ్లాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తుల్లోకి వారు వెళ్లేవిధంగా కాంపిటీషన్లో నెగ్గుకు రావాలనే సదుద్దేశంతో జగన్ నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఆ నిర్ణయాన్ని తెలుగు భాషకు జోడించి కన్నతల్లి మీద ప్రేమ లేనట్లు, తెలుగుమీద ప్రేమ లేన్నట్లుగాను, తెలుగుకు ద్రోహం చేస్తున్న వ్యక్తులుగా మమ్నల్ని క్రియేట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వేదికలపై టీడీపీ వారు వచ్చి మాట్లాడటం చూస్తుంటే బాధ కలుగుతోంది. 
 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతూ జీఓ తీసుకురాలేదా? దీనికి మండలి బుద్ధప్రసాద్ సమాధానం చెప్పాలి. వేదికపై టీడీపీ నాయకులను చూశాను. ఒక నాయకుడు స్కూళ్ళు, కాలేజీలు నడుపుతున్నారు. ఆయన స్కూళ్ళు, కాలేజీల్లో తెలుగు మీడియం ఎందుకు లేదని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు.

తెలుగు మీడియం ఎందుకు ప్రవేశపెట్టలేదని, ఎందుకు ప్రోత్సహించటం లేదని నిలదీశారు. ఇంగ్లీషు మీడియంతో వ్యాపారం ముడిపడి ఉంటుంది కానీ ప్రభుత్వం ఆపని చేస్తే చెడ్డ అపరాధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలేజీలు నిర్వహిస్తున్న వ్యక్తినే మంత్రిగా పెట్టుకున్నారు. ఆయనకు తెలుగు మీడియం పెట్టమని ఎందుకు చెప్పలేకపోయారు ? కార్పొరేట్ కళాశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రభుత్వాలు తెచ్చాయని బుద్ధ ప్రసాద్ అంటున్నారు.  కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహించింది మీరు కాదా?
 పేదవాడు చదువుకోవటానికి ప్రభుత్వ స్కూళ్ళు, కళాశాలలే దిక్కు.

అటువంటి పరిస్థితుల్లో పేదవాడు ఇంగ్లీషు మీడియం ఎక్కడ చదువుకోవాలి? పేదవారు వైద్యం కోసం వెళ్లేది కూడా ప్రభుత్వ ఆసుపత్రులకే. ఈ ప్రభుత్వం పేదవారికి, బడుగు బలహీన వర్గాలకు మంచి చదువు, మంచి వైద్యం కావాలని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులను చక్కని పద్ధతుల్లో తీసుకువెళ్లాలనే మంచి ప్రయత్నాన్ని టీడీపీ నేతలు తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గచర్య అని అంబటి అన్నారు.
 
 తెలుగు పండితులు, రచయితలు, భాషా ప్రేమికులకు మనవి చేస్తున్నా. మేము కూడా తెలుగు భాషా ప్రేమికులమే. పేదవాడికి మంచి చదువు రావాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నాము. తెలుగు భాష నేర్చుకోవచ్చు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు నేర్చుకోవచ్చు.

ఇంటర్మీడియట్లో తెలుగు ఉంది. తెలుగు బీఏ, ఎంఏ ఉంది. తెలుగులో పీహెచ్ డీ కూడా చేయవచ్చు. తెలుగు భాష మీద పట్టుకావాలనుకునేవారికి అవకాశాలు ఉన్నాయి. మాధ్యమం మాత్రమే ఇంగ్లీషు మీడియంలో ఉంది కానీ తెలుగు భాషను నిషేధించారనే విధంగా టీడీపీ నేతలు మాట్లాడటం సరికాదని అంబటి రాంబాబు హితవు పలికారు. 
 
పేదవారు, బలహీనవర్గాల వారు ఇంగ్లీషు మీడియంలో, నారాయణ లాంటి కాలేజీల్లో చేరి ఫీజులు కట్టలేరు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ ఇంగ్లీషు మీడియం వారికి చదువు నేర్పిస్తారు. ఏ తల్లిదండ్రులు అయినా తమ పిల్లలు తెలుగు మీడియంలో చదువుకోవాలని అనుకునేవారు ఒక్కరైనా ఉన్నారా.. ఉంటే చూపించండని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 
 
పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఇంగ్లీషు మీడియంలోనే పిల్లల్ని చదివించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదవారు, బడుగుబలహీన వర్గాల వారు ఏమనుకున్నాంటున్నారో గమనించి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏదో తెలుగు భాషకు అన్యాయం జరిగినట్లు, తెలుగు భాషకు ద్రోహం చేసినట్లు మాట్లాడుతున్నారు. 
 
తెలుగు రచయితల సంఘం కన్నా తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని మాట్లాడుతున్నారు. కొన్ని పత్రికలు ప్రభుత్వం ఏం చేసినా నెగిటివ్గా రాయటమే పనిగా పెట్టుకున్నారు. మీవి చాలా గొప్ప పత్రికలు. పుంఖాను పుంఖాలుగా రాసుకుంటున్నారు. మీ మనవళ్లు, మీ పిల్లలు ఏ మీడియంలో చదువుకుంటున్నారు. మీరు నిర్వహించే కళాశాలలు ఏ మీడియంలో ఉన్నాయి. అక్కడ మాత్రం మీరు ప్రేమ చూపించరని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలుగు భాషకు వ్యతిరేకంగా ఉన్నాయని, తెలుగు భాషను ఖూనీ చేస్తున్నారని పుంఖాను పుంఖాలుగా రాస్తారని అంబటి రాంబాబు మండిపడ్డారు.

ఆచరించలేని వారు మరొకరిని ప్రశ్నించే హక్కు మీకు ఉందా అని అంబటి సూటిగా ప్రశ్నించారు. మీరు నిర్వహించే సంస్థల్లో తెలుగు మీడియం ప్రవేశపెట్టరు. మీ పిల్లల్ని, మనవలను ఇంగ్లీషు మీడియంలోనే చదవిస్తున్నారు. అదేమీ తప్పనటం లేదు. మీరు ముందుచూపులో వెళ్తున్నారు.

ప్రపంచం కూడా ముందు చూపుతో వెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక మమ్మల్ని విమర్శించటం సరికాదని హితవు పలికారు. పిచ్చిపిచ్చి రాతలు రాసి భ్రష్టుపట్టించే కార్యక్రమం సరికాదని మండలి బుద్ధప్రసాద్ కి సూచిస్తున్నానని అంబటి రాంబాబు తెలిపారు. రాజకీయ వేదిక చేసి జగన్ ని, ప్రభుత్వాన్ని విమర్శలు చేయవద్దని అన్నారు.
 
 రచయితలు కూడా చాలా గొప్పవారు వచ్చారు. తెలుగు భాష మీద ప్రేమతో మహనీయులు వచ్చారని వారిపై మాకు ప్రేమ, గౌరవం ఉందన్నారు. భాషపట్ల వారు చేస్తున్న కృషి అభినందీయమైనది. తెలుగు భాషా వ్యతిరేకులుగా మమ్నల్ని చిత్రీకరించవద్దని అంబటి రాంబాబు కోరారు. 
 
భావితరాలు ఉద్యోగాలు సాధించుకునే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి ఆరోతరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నామని అన్నారు. తెలుగు నేర్చుకోవాలనుకునేవారికి పీహెచ్డీ చేయవచ్చని అంబటి రాంబాబు సూచించారు.

జగన్ కి తన తల్లి అంటే ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా నేను చెప్పనవ్వసరం లేదు. అలాగే తెలుగు భాష మీద కూడా సీఎంకి ప్రేమ ఉందని అంబటి రాంబాబు తెలిపారు. దీన్ని రాజకీయంగా వాడుకోవటానికి తెలుగు రచయితల పేరుతో వ్యవహరిస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అంబటి రాంబాబు తెలిపారు. వైయస్ఆర్సీపీని విమర్శంచే నైతిక అర్హత టీడీపీ నేతలకు, మండలి బుద్ధ ప్రసాద్కు లేదని అంబటి రాంబాబు మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధానిలో 11వరోజు రైతుల దీక్ష.. దేవినేని సంఘీభావం