తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి మరో రాకెట్ ప్రయోగం జరిగింది. ఉదయం 10.42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 వాహకనౌక ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.
ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.
భారతదేశానికి చెందిన రెండోతరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్-01 మొదటిది. ఈ ఉపగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఉపగ్రహంలో రుబిడియం అణుగడియారం ఉంది. ఈ టెక్నాలజీని భారత్ సొంతంగా అభివృద్ధి చేసింది. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో దీనిని నిర్మించారు. ఇటువంటి టెక్నాలజీ అతితక్కువ దేశాల వద్ద మాత్రమే ఉంది.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న పలు ఉపగ్రహాలు అటామిక్ క్లాక్ పనిచేయడం మానేయగానే డేటా పంపడం ఆపేస్తాయి. ఖచ్చితమైన ట్రాకింగ్‌ను కూడా అందించలేవు. 2018లో కూడా ఇలా పనిచేయని ఉపగ్రహాన్ని మరో శాటిలైట్ పంపి భర్తీ చేశారు. ప్రస్తుతం నాలుగు ఐఆర్‌ఎన్‌ఎస్ ఉపగ్రహాలు మాత్రమే లొకేషన్ సర్వీసులను అందిస్తున్నాయి.
రెండో తరం నావిక్ ఉపగ్రహాలు ఎల్1 సిగ్నల్స్‌ను పంపగలవు. దీంతో ఉపగ్రహ ఆధారిత నేవిగేషన్ వ్యవస్థలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు సహకరిస్తాయి. ఈ సిగ్నల్స్‌ను అమెరికా అభివృద్ధి చేసిన జీపీఎస్‌లో వినియోగిస్తున్నారు. ఫలితంగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థలను తక్కువ విద్యుత్తు, సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉన్న చిప్స్ అమర్చే పరికరాల్లో, పర్సనల్ ట్రాకర్లలో మరింత మెరుగ్గా వినియోగించుకొనే అవకాశం లభించనుంది. రెండో తరం నావిక్ ఉపగ్రహాలు 12 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం సేవలు అందించనన్నాయి. ప్రస్తుతం ఉన్న నావిక్ ఉపగ్రహాలు 10 ఏళ్లపాటు మాత్రమే సేవలు అందించగలవు.