ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) 9001-2015 సర్టిఫికెట్ దక్కించుకోవడం ఆనందంగా ఉందని ఆసంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు.
గత ఏడాది నైపుణ్య శిక్షణలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఎపిఎస్‌ఎస్‌డిసి ఈసారి ఈఘనత సాధించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
త్వరలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ కాలేజీల్లో భాగస్వామ్యం కోసం అనేక సంస్థలు, పరిశ్రమలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావడం సంస్థకు మరింత కలిసివస్తుందని ఆయన అన్నారు. ఈ ఘనత సాధించేందుకు కారణమైన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
ఈ మేరకు తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి ప్రధాన కార్యాలయంలో సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, ఎండి సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్ అందుకున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రమాణాలను పాటిస్తున్న సంస్థలకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫికెట్ ఇస్తారు.
ఎపిఎస్‌ఎస్‌డిసిలో ఉత్తమమైన పద్ధతులను అమలు చేయడంతోపాటు ప్రతి విభాగంలో క్రమపద్దతిలో డాక్యుమెంటేషన్, సరైన విధి విధానాలు, పద్ధతులు, రికార్డులు, ఫైళ్లు నిబంధనల ప్రకారం పని చేయడం లాంటివన్నీ సక్రమంగా ఉన్నట్టు మూడు నెలలపాటు తనిఖీ చేసిన ఐఎస్ఓ కమిటీ నిర్ధారించింది.
ఇవన్నీ పరిశీలించిన ఐఎస్ఓ ఆడిటర్ల కమిటీ ఎపిఎస్‌ఎస్‌డిసికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇవ్వాలని సూచించింది. ఈ సర్టిఫికేషన్ ను యుకెకి చెందిన అక్రిడేషన్ సర్వీసెస్ ఫర్ సర్టిఫైయింగ్ బాడీస్ సంస్థ (ఎ.ఎస్.సి.బి) అందించింది.