Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ 5 గ్రామాలలో 2 రోజులలో సాధారణ పరిస్థితి : మంత్రి బొత్స

ఆ 5 గ్రామాలలో 2 రోజులలో సాధారణ పరిస్థితి : మంత్రి బొత్స
, శుక్రవారం, 8 మే 2020 (21:20 IST)
ఎల్జి పాలిమర్స్ ప్రమాదం మూలంగా ఏర్పడిన పరిస్థితి నుండి సమీప గ్రామాలను 2 రోజులలో సాధారణస్థితికి  తీసుకువచ్చేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టడం జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్మాగారం చుట్టుపక్కల 2, 3 కిలోమీటర్ల పరిధిలో విషవాయువు ప్రభావాన్ని గంటగంటకూ సమీక్షిస్తున్నట్లు తెలిపారు. నిపుణులతో కూడిన మల్టీ మెంబర్ కమిటీ రేపు విశాఖ వస్తుందని వారి సలహాలను అనుసరించి మరింత వేగవంతమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రమాదం సంభవించినప్పుడు స్పందించిన విధంగానే ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను భయాందోళనలకు గురి కాకుండా చూడాలన్నారు. రెండు రోజులు ఐదు గ్రామాల  ప్రజలు రాకూడదని, మిగిలిన గ్రామాల వారు నిర్భయంగా నిశ్చంతగా ఉండవచ్చునని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న వారినందరినీ తక్షణమే విచారణ చేయాలని ఆదేశించారు.

వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రమాదం సంభవించడానికి గల కారణాలను నిపుణుల కమిటీ సూచిస్తుందని దాని ననుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. రసాయనాలు నిల్వ ఉండడం తో పాటు మానవ తప్పిదం కూడా ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిసింది అన్నారు.
 
ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ప్రమాద స్థాయిని, నష్టాన్ని,  గుర్తించడం దాదాపు పూర్తయిందని ప్రజల ఆందోళనలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిన్న, ఈరోజు కర్మాగారం ప్రాంతంలో ఉన్న గ్రామాలలో పరిసర గ్రామాలలో విష వాయువు స్థాయిని రికార్డు చేశారని, కర్మాగార పరిసర గ్రామాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో "0" గా నమోదైనట్లు తెలిపారు.

నిపుణుల కమిటీ వచ్చిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలన జరిపి తగిన చర్యలు చేపడతామని, రెండు లేక మూడు రోజులలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని వెల్లడించారు.

జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ కర్మాగారం ప్రధాన ద్వారం, వెంకటాపురం గ్రామాలలో మాత్రమే విషవాయువు జాడలు మిగిలి ఉన్నట్లు కనుగొన్నారని, కాబట్టి ఐదు గ్రామాలు మినహా మిగిలిన ప్రాంతాలకు ఎటువంటి ప్రమాదం లేనందున ప్రజలందరికీ తిరిగి రావాలనే అవగాహన కల్పిస్తామన్నారు.  ఐదు గ్రామాల్లో మాత్రం రెండు రోజులపాటు పూర్తి నిషేధం ఉంటుందని తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో కార్మిక శాఖ మంత్రి గుమ్ములూరు జయరామ్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాసు నగర పోలీసు కమిషనర్ ఆర్.కె. మీనా, జీవీఎంసీ కమిషనర్ జి సృజన, శాసనసభ్యులు గుడివాడ  అమర్నాథ్, అన్నం రాజు అదీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్‌పై వెనుకంజ లేదు.. గ్రీన్ జిల్లాలుగా ప్రకటించండి : తెలంగాణ సర్కారు