మత ప్రాతిపదికన పేర్లు అడిగి మీరు 26 మందిని అత్యంత కిరాతకంగా చంపినా పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అలా మాట్లాడాలనుకుంటే వారు పాకిస్తాన్‌కే వెళ్లిపోవాలని సూచించారు. అసలు ఎవరినైనా చంపడం దారుణం. మరీ మత ప్రాతిపదికన చంపడం అత్యంత దారుణమన్నారు.
పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో పవన్ కల్యాణ్ నేతృత్వంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్‌రావు కుటుంబానికి పార్టీ తరపున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్.. భారత్‌లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదన్నారు. సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలన్నారు. చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారు.. కుటుంబాన్ని తీసుకుని కాశ్మీర్‌కు వెళ్లే చంపేశారన్నారు.
కాశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి అని అన్నారు.