Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పవన్‌ కల్యాణే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా వుండేది: చంద్రబాబు

Advertiesment
పవన్‌ కల్యాణే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా వుండేది: చంద్రబాబు
, శనివారం, 12 అక్టోబరు 2019 (08:49 IST)
ఎన్నికల తర్వాత తొలిసారి విశాఖలో పర్యటించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు..ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కో తప్పుడు నిర్ణయంతో ప్రజలు పడుతున్న అవస్థను హైలెట్ చేస్తూ ప్రభుత్వం తీరును కడిగిపారేశారు చంద్రబాబు. ఈ నాలుగు నెలల పాలనలో ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాలు రాష్ట్రానికి పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చాయని అన్నారు.
 
రాష్ట్రంలో అణిచివేత విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో కార్యకర్తల వేధింపులు, ప్రశ్నించే మీడియాపై నిషేధం విధింపుతో నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. టీవీ5, ఏబీఎన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు జగన్‌ సిగ్గుపడాలంటూ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హెచ్చరించినా ఇంకా దారికి రాకపోవడం శోచనీయమన్నారు.
 
అధికార పార్టీ వేధింపు రాజకీయాలకు దిగజారిందని చంద్రబాబు ఆరోపించారు. అక్రమ కేసులు, ఇసుక కొరత, విద్యుత్ కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఎప్పుడైనా విద్యుత్ సమస్యలు వచ్చాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంలో చివరికి మందుబాబుల దగ్గర కూడా జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

పోలవరం టెండర్ల దగ్గర్నుంచి..కృష్ణా, గోదావరి బేసిన్ లో నీటి మళ్లింపు వరకు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. ఇక పార్టీ బలోపేతంపైనా కేడర్ కు సూచనలు చేశారు. యువనాయకులు తయారు చేస్తామన్న చంద్రబాబు..టీడీపీలో కార్యకర్తలే నాయకులు అని అన్నారు.
 
కేంద్రంతో విభేదించడంతో గడచిన ఎన్నికల్లో నష్టపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యా నించారు. ‘ప్రజల్ని నమ్ముకున్నాం. ప్రయోజనం పొందినవారు సహకరించలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించాం. దానివల్ల రాష్ట్రానికి లాభం జరగలేదు.. పార్టీకి నష్టం జరిగింది..

అది పెట్టుకోకుండా ఉంటే ఇంకో విధంగా ఉండేది.. ఆ చాప్టర్‌ ఈజ్‌ ఓవర్‌. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలనే పట్టుదలకు పోయాం.. దాంతో ఇబ్బంది వచ్చింది. భవిష్యత్‌లో ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి...’ అని అన్నారు.
 
గాజువాక సమీక్ష సందర్భంగా.. గడచిన ఎన్నికల్లో అక్కడ చంద్రబాబు పర్యటించకపోవడంపై 30 వేల మంది టీడీపీ క్రియాశీల కార్యకర్తలలో సందేహం ఉందని మాజీ కార్పొరేటర్‌ ప్రసాదుల శ్రీనివాస్‌ చెప్పారు. చంద్రబాబు బదులిస్తూ ఒక పార్టీ అధ్యక్షుడు పట్ల హుందాతనం ప్రదర్శించాలనే ఉద్దేశంతోనే తాను పర్యటించలేదని స్పష్టంచేశారు.

ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీపై ఉంటుందనే ఆలోచన చేశామే తప్ప ఎవరితోనూ మనకు లాలూచీ లేదని చెప్పారు. ‘ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే బహిరంగంగా పొత్తు పెట్టుకునేవాళ్లం. గాజువాకలో నేను పర్యటించకపోవడం వల్ల టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు కొంత ఇబ్బంది ఎదురైంది. నేను పర్యటించి ఉంటే కొన్ని ఓట్లు పెరిగి ఉండేవి. గాజువాకలో మన అభ్యర్థి శ్రీనివాసరావు బాగా పనిచేశారు. పవన్‌ కల్యాణే గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది’ అని తెలిపారు.
 
ఆ రాయితో ఎవరినైనా కొడతాడు..
ముఖ్యమంత్రి జగన్‌ చేతిలో అధికారం పిచ్చోడి చేతిలో రాయి వంటిదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘రాయితో అతనే కొట్టుకుంటాడు.. మనల్ని కొడతాడు.. ఇంకా ఎవరినైనా కొడతాడు’ అని విమర్శించారు. పోలీసులు ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడి దిగజారి ప్రవర్తిస్తున్నారని.. కొందరు మరీ బరితెగించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

గురువారం తనకు స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు వస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, ఇతర నాయకులపై కేసులు పెట్టారని.. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనపై 26 కేసులు పెట్టి ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనపై కేసుల కోసం ఫైళ్లు తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారని.. ఆధారాల కోసం తవ్వండి...తవ్వండి...అంటూ చెబుతూనే ఉన్నారని.. ఆయన మనస్తత్వం ఎవరికీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. సిగ్గు..శరం, పౌరుషం ఈ ముఖ్యమంత్రికి లేవని దుయ్యబట్టారు.
 
తెలుగుదేశం పార్టీకి వెన్ను...దన్ను కార్యకర్తలేనని, నిజమైన, అంకితభావం కలిగిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తానని చంద్రబాబు అన్నారు. ప్రతిభావంతులు, సమర్థులకే ప్రాధాన్యం ఇస్తానని.. ప్రతిభను రికార్డు చేస్తానని చెప్పారు. ‘2014 ఎన్నికల తర్వాత ఇన్‌చార్జి వ్యవస్థ ఏర్పాటుచేస్తే ఉపయోగం లేదు సరికదా చివరకు నష్టపోయాం.

ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున ఇన్‌చార్జులు అవసరం. రానున్న 30-40 ఏళ్లను పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేస్తాం’ అని తెలిపారు. సమీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు, నిమ్మకాయల చినరాజప్ప, సబ్బం హరి, ఎం.శ్రీభరత్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులేస్తాం.. వైసీపీ ఎమ్మెల్యే