Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇసుక కొరతతో కార్మికుల ఇబ్బంది... పవన్ కళ్యాణ్

ఇసుక కొరతతో కార్మికుల ఇబ్బంది... పవన్ కళ్యాణ్
, శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (21:33 IST)
ఇసుక సరఫరాలో ప్రభుత్వ విధానం ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రూ. 375కి టన్ను ఇసుక వచ్చేస్తుందని చెప్పారని, తీరా స్టాక్ యార్డుకి వచ్చి చూస్తే పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు.

స్టాక్ యార్డులో టన్నుకి రూ. 900 వసూలు చేస్తున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనపై క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా మంగళగిరి మండల పరిధిలోని నవులూరులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇసుక స్టాక్ యార్డుని సందర్శించారు.

శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా స్టాక్ యార్డ్ దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. స్టాక్ యార్డు వద్ద భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ దశలో ఇళ్లు ఆపేసినవారు  ఇసుక కొరతతో తాము పడుతున్న ఇబ్బందులను జనసేనానికి వివరించారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇసుక కొరత వల్ల ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. నిర్మాణ రంగం మీద ఆధారపడిన వ్యాపారాలు అన్ని తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వం అందరికీ ఇసుక అందుబాటులో ఉంచి తక్కువ ధరకు అందించాల్సిందిపోయి ఇసుక కొరతను సృష్టించి లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టడం సరికాదు.

ఇసుక మీద స్పష్టమైన పాలసీ తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచాలిగానీ,  ఇసుక లేకుండా చేసి ఎక్కువ ధరకు అమ్మడం సరైన విధానం కాదు. కృత్రిమ కొరతతో ఇళ్లు కట్టుకొంటున్నవారు, అటు భవన నిర్మాణ కార్మికులు నష్టపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తులకి వెళ్లిపోయింది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష సభ్యులు కూడా వాటాలు తీసుకుని ప్రజల్ని దోచుకున్నారన్న విషయం పోరాట యాత్ర సమయంలో నా దృష్టికి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకం అంటోంది. పారదర్శకత అంటే స్టాక్ యార్డుల్లో రూ. 375కి బదులు టన్ను ఇసుక రూ. 900 అమ్ముతున్నామని చెప్పాలి. వెబ్ సైట్ లో ఏదో మూలన పాప్ అప్ పెట్టాం అంటున్నారు.

మా కార్యాలయం నుంచి ఇసుక బుక్ చేద్దామని ప్రయత్నం చేస్తే అలాంటిది ఏమీ కనబడలేదని చెబుతున్నారు. వ్యవహారం అంతా తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 100 రోజుల పాలనపై ఇవ్వబోయే నివేదికలో
 
 ఇసుక విషయంలో జరుగుతున్న అవకతవకల్ని స్పష్టంగా విన్నవిస్తాం. ప్రతిపక్షం అంటే పద్దతి పాడులేకుండా ఇష్టం వచ్చినట్టు అధికార పక్షాన్ని తిట్టడం కాకుండా మేము విధానపరంగా జరుగుతున్న లోపాలు, అవకతవకలపై మాత్రమే మాట్లాడుతాం. ఇసుక పాలసీ ప్రభుత్వం నష్టపోకుండా ప్రజలకి సౌలభ్యంగా ఉండాల"ని తెలిపారు.
 
అధిక ధర వసూలు చేస్తున్నారు.. నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. "వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానం గురించి క్షేత్ర స్థాయిలో తెలుసుకుందాం అని ఇక్కడకు వస్తే చాలా ఆసక్తికర విషయాలు మా దృష్టికి వచ్చాయి.

ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే అదనంగా రూ. 525 వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే కలెక్టర్ ఆదేశాలు అంటున్నారు. రూ. 375కి బుక్ చేసుకున్న వారు తీరా స్టాక్ యార్డుకి వచ్చేసరికి రూ. 900 అంటే సామాన్యులకి ఎలా అర్ధం అవుతుంది. గుంటూరు జిల్లాలో మూడు నిల్వ కేంద్రాలు పెట్టారు.

ఇక్కడ చూస్తే 10 నుంచి 12 టన్నులు మాత్రమే ఇసుక ఉంది. ఇంత తక్కువ స్టాక్ పెట్టి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వైనం ఇక్కడ కనబడుతోంది. మూడు నెలలుగా పనులు లేక భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉంటున్నారు. ప్రజలకు తక్కువ ధరకే ఇసుక ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.

నవులూరు ఇసుక నిల్వ కేంద్రం వద్ద పలువురు స్థానికులు ప్రభుత్వ విధానాలతో తాము పడుతున్న ఇబ్బందులను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 1500లకి ట్రాక్టర్ ఇసుక వస్తే, ఇప్పుడు రూ. 4500 చెల్లించాల్సి వస్తోందని, ఇళ్ల నిర్మాణాలు సగంలో నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఇంటి నిర్మాణానికి 2 లక్షల రూపాయిల అదనపు భారం పడుతోందని తెలిపారు. నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ కూలీలు గడచిన నాలుగైదు నెలలుగా రోడ్డున పడ్డారని తెలిపారు. గతంలో కూలికి వెళ్లి వస్తూ అన్న క్యాంటిన్ లో రూ. 5కే భోజనం చేసి వచ్చేవారమని, ఇప్పుడు పనులూ లేవు, రూ. 5 భోజనమూ లేద"ని చెప్పి వాపోయారు.
 
ప్రభుత్వం ఇసుక విధానంలో ప్రకటించిన విధంగా నిల్వ కేంద్రంలో కనీసం ఒక్క సిసి కెమెరా గానీ, వేయింగ్ మెషీన్ గానీ, లోడింగ్ కి సంబంధించిన యంత్రాలు గానీ ఏమీ లేకపోవడాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రాబ్యాంకును కాపాడుకుందాం.. సీపీఐ