Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల ఘాట్‌రోడ్డులో ఒక్కసారి ప్రమాదం చేస్తే డ్రైవర్‌ను అనుమతించరు

తిరుమల ఘాట్‌ రోడ్డులలో తరచూ జరిగే ప్రమాదాలకు ప్రైవేటు జీపు డ్రైవర్లే కారణమన్న భావన బలంగా ఉంది. ఇందులో ఎంతోకొంత వాస్తవం లేకపోలేదు. డ్రైవింగ్‌ సరిగ్గా నేర్చుకోక మునుపే యాత్రికులను ఎక్కించుకుని కొండ ఎక్కుతున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాం

Advertiesment
తిరుమల ఘాట్‌రోడ్డులో ఒక్కసారి ప్రమాదం చేస్తే డ్రైవర్‌ను అనుమతించరు
, సోమవారం, 2 జనవరి 2017 (20:49 IST)
తిరుమల ఘాట్‌ రోడ్డులలో తరచూ జరిగే ప్రమాదాలకు ప్రైవేటు జీపు డ్రైవర్లే కారణమన్న భావన బలంగా ఉంది. ఇందులో ఎంతోకొంత వాస్తవం లేకపోలేదు. డ్రైవింగ్‌ సరిగ్గా నేర్చుకోక మునుపే యాత్రికులను ఎక్కించుకుని కొండ ఎక్కుతున్నారు. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి వారిని నియంత్రించేందుకు తితిదే ఈఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారి ప్రమాదానికి కారణమైన జీపును, జీపు డ్రైవర్‌ను మళ్ళీ తిరుమలకు రానివ్వకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది డ్రైవర్ల పొట్టుగొట్టేదిగగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
నిరుద్యోగులుగా ఉన్న యువకులు, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రవాణా వృత్తిలోకి వస్తున్నారు. తిరుపతి ప్రాంత యువకులే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న వారు ఇక్కడికి వచ్చి జీపులు కొనుగోలు చేసి రవాణా రంగంలోకి స్థిరపడుతున్నారు. తిరుమలకు యాత్రికులను తీసుకెళితే పది రూపాయలు ఎక్కువగా వస్తాయన్న ఆశతో ప్రమాదకరమైన ఘాట్‌ రోడ్డులో వాహనాలు నడుపుతున్నారు. వందల జీపులు తిరుమల ఘాట్‌ రోడ్డులో తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తే యాత్రికులను ఆదుకున్నది  ఈ జీపులే. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రింబవళ్లూ జీపు నడుపుతుంటారు.  ఈ క్రమంలో ఒక్కసారి ప్రమాదాలు జరుగుతున్నమాట వాస్తవం. ఏ డ్రైవరైనా కావాలనే యాక్సిడెంట్‌ చేయరు. అనుకోకుండానే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటికి చట్టప్రకారం ఏ శిక్షలు ఉంటే వాటిని అమలు చేయవచ్చు. అయితే తితిదే ఉన్నతాధికారులు మరీ కఠినంగా వ్యవహరిస్తున్నారన్న భావన కలుగుతోంది.
 
గతంలో ఏ వాహనమైనా యాక్సిడెంట్‌కు కారణమైతే దాన్ని కొన్ని నెలల పాటు నాట్‌ అలోడ్‌ లిస్టులో పెట్టేవారు. అంటే ఆ వాహనాన్ని తిరుమలకు అనుమతించే వారు కాదు. వాహనం నెంబరు కంప్యూట్‌లో ఫీడ్‌ అయిఉండడం వల్ల రసీదు కోసం నెంబరు టైప్‌ చేసినప్పుడే తెలిసిపోతుంది. దీంతో ఆపేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రమాదాలకు కారణమైన జీపులను శాశ్వతంగా అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పటికీ ఆచరణలోకి వచ్చింది కూడా. దాదాపు ఆరునెలలుగా ఇది ఆచరణలో ఉంది. ఈ కాలంలో ప్రమాదాలకు కారణమైన జీపులను తిరుమలకు రానివ్వకుండా ఆపేశారు. దీంతో అప్పోసప్పో చేసి జీపులు కొనుగోలు చేసిన నిరుద్యోగులు ఇప్పుడు దిక్కుతోచకుండా అలమటిస్తున్నారు. డ్రైవర్‌ చేసిన తప్పిదానికి ఓనర్లు నష్టపోయిన ఉదంతాలు ఉన్నాయి. 
 
తిరుమలకు యాత్రికులను తీసుకొచ్చి జీపు డ్రైవరు అప్రమత్తంగా ఉండాలన్న వాదన సరైనదే. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతుంటాయి. అంతమాత్రాన శాశ్వతంగా తిరుమలకు అనుమతించకూడదన్న నిర్ణయం సరైనది కాదని జీపు డ్రైవర్లు ఆవేదనతో చెబుతున్నారు. గతంలోఉన్న పాత పద్థతిలోనే కొనసాగించాలని కోరుతున్నారు. తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రయాణానికి సమయం నిర్ధేశించారు. ఈ సమయానికంటే ముందు వెళితే చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే దారి మధ్యలోనూ నిఘా వేసి అతి వేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లను గుర్తించి హెచ్చరించవచ్చు. డ్రైవర్లతో తరచూ సమావేశాలు నిర్వహించి యాత్రికులను సురక్షితంగా ఎలా తరలించాలో అవగాహన కల్పించవచ్చు. తితిదే అధికారులు విశాల దృష్టితో మానవతా దృక్పథంలో ఆలోచించి తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డ్రైవర్లు వేడుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ - హాజరు కానున్న నరేంద్ర మోదీ