సాధారణంగా యువతీయువకుల కోసం స్వయంవరం నిర్వహించడం చూశాం. కానీ, ఇపుడు 90 యేళ్ళ వయస్కులకు కూడా స్వయంవరం జరిగింది. అది ఎక్కడో కాదు.. మన భాగ్యనగరంలో (హైదరాబాద్). ఎల్డర్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, తోడు నీడ, అనుబంద్ ఫౌండేషన్, సాకేత్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లన్నీ కలిసి ఈ స్వయంవరాన్ని నిర్వహించాయి.
ఆదివారం దోమల్‌గూడలోని ఏవీ కళాశాలలో నిర్వహించిన పెద్దల స్వయంవరానికి విశేషస్పందన లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పెద్దలు హాజరయ్యారు. 50-90 ఏళ్ల వయసున్న పెద్దల్లో అసలు పెళ్లి కానివారు, జీవిత భాగస్వామిని కోల్పోయిన వారు, విడాకులు తీసుకున్న వారు దాదాపు 400 మంది వరకు వచ్చారు.
అలాగే, తమ భర్తల చేతిలో మోసపోయిన మహిళలు, భార్యలు మోసగించిన భర్తలు భార్యలు చనిపోవడంతో పిల్లలు పట్టించుకోని భర్తలు, భర్తలు చనిపోవడంతో ఎలాంటి ఆధారం లేని మహిళలు ఈ స్వయంవరంలో పాల్గొన్నారు.
ఈ స్వయంవరంలో తమ మనసుకు నచ్చినవారిని ఎంచుకున్నారు. ఆ తర్వాత వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఒప్పంద తేదీని ఖరారు చేసి రిజిస్ట్రార్ సహాయంతో ఉచితంగా వివాహం చేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ, ఒక వయసులో జీవిత భాగస్వామిని కోల్పోయిన స్త్రీలు, పురుషులు ఒంటరిగా జీవించలేక ఎంతో బాధ పడుతుంటారని చెప్పారు. అలాంటి పెద్దలు నిస్సంకోచంగా మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.
కాగా, ఈ స్వయంవరంలో పాల్గొన్నవారిలో ఓ జంట అక్కడే ఒక్కటయ్యారు. ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహించి రిటైరైన ఈశ్వర్ ప్రసాద్ (64), విజయ అనే మహిళను ఇష్టపడ్డారు. ఈశ్వర్‌ప్రసాద్ రెండేళ్లుగా ఈ కార్యక్రమ నిర్వాహక సంస్థలో సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కటైన ఆ జంటను అతిథులు అభినందించారు.