హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఏరియాలో ఓ పసికందు శవాన్ని వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి బస్తీ నుంచి గర్భిణి సునిధి కుమార్ ఆమె భర్త రజని సుమన్‌లు ఈనెల 15వ తేదీన శంషాబాద్ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. సునిధి పురిటినొప్పులతో బాధపడుతూ వచ్చింది. ఆమెను పరిశీలించిన వైద్యులు.. గర్భంలో ఉన్న శిశువు మృతిచెందినట్లుగా నిర్ధారించారు.
ఆ తర్వాత గర్భం నుంచి ఆడ మృతశిశువును బయటికి తీసి వారికి అప్పగించారు. అయితే, భార్యాభర్తలు మాత్రం ఆ శిశువును ఖననం చేయలేదు. ఆస్పత్రి సిబ్బందికి కొంత డబ్బు చెల్లించి ఖననం చేయాల్సిందిగా చెప్పి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది ఆస్పత్రి సమీపంలో మాములుగా గుంత తీసి అక్కడే పూడ్చిపెట్టారు.
అయితే, సిబ్బంది సరిగా పూడ్చకపోవడంతో గురువారం ఉదయం కుక్కలు పసికందు మృతదేహాన్ని బయటకు లాగి నోటకరుక్కొని వీకర్ సెక్షన్ కాలనీకి పరుగులు పెట్టాయి. మృతదేహాన్ని తింటుండగా స్థానికులు వాటిని తరిమివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రి సిబ్బంది, వైద్యులను విచారించారు.
మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పసికందు మృతదేహాన్ని వదిలేసి వెళ్లపోయిన వారు కూడా కేవలం పేర్లు మాత్రమే చెప్పారని, ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వలేదని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.