Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వందల కేసులు

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వందల కేసులు
, శనివారం, 25 జనవరి 2020 (08:36 IST)
రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీఐడీ వందల సంఖ్యలో కేసులు నమోదు చేసింది. సీఐడీ కేసులు నమోదు చేస్తున్న వారిలో జేఏసీ నాయకులు సైతం వున్నారు. అయితే ప్రస్తుతం కేసులు నమోదవుతున్న పలువురు నాయకులు ఏ విధమైన భూ కొనుగోళ్ళకు పాల్పడలేదని తెలిసింది.

అయితే పలువురు ప్రముఖుల తరుపున వకాల్తా పుచ్చుకొని భూ విక్రయదారులతో మధ్యవర్తిత్వం వహించినట్టు చెబుతున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో 2014 అనంతరం జరిగిన భూ లావాదేవీలలో మధ్యవర్తిత్వం నిర్వహించిన వారికి వెన్నులో వణుకు మొదలైంది.

కొంతమంది ప్రముఖులు గ్రామాలలో పలుకుబడి కలిగిన స్ధానిక నాయకుల ద్వారా అసైన్డ్‌ రైతులకు నచ్చజెప్పి భూములకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారని సిీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాలలో మధ్యవర్తిత్వం చేసిన వారి జాబితా సిీఐడీ అధికారులు సేకరించినట్టు సమాచారం.

ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలలో వారు చురుకైన పాత్ర నిర్వహిస్తుండటం యాధృచ్ఛికం అయినప్పటికీ పలు అనుమానాలకు తావిస్తున్నట్టయింది. రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనల సందర్భంగా న్యాయస్ధానాల్లో పోరాటాలకు, న్యాయవాదులకు ఫీజులు చెల్లింపు, భోజన ఏర్పాట్లు తదితరమైన వాటిని పెద్దఎత్తున వ్యయం అవుతున్నది.

రైతులే స్వచ్ఛందంగా విరాళాలు పోగు చేసుకొని ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనలేని వారు విరాళాల రూపంలో కొంత మొత్తాన్ని పంపిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పలు రూపాలలో విరాళాలు అందుతున్నట్టు చెబుతున్నారు. వీటికి సంబంధించిన లెక్కలన్నింటినీ జేఏసీ నాయకులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.

తాజాగా వారిలో పలువురిపై సిీఐడీ కేసులు నమోదవుతుండటంతో వారంతా అరెస్ట్‌ కావటం లేదా అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన పరిస్దితులు ఉత్పన్నం అవుతున్నాయి. జేఏసీ నేతలపై కేసులు యాదృచ్ఛికంగా నమోదవుతున్నయా ? లేక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు ప్రభుత్వం తరుపున వాదించేందుకు అయిదు కోట్ల రూపాయల ఫీజు చెల్లిస్తూ ప్రఖ్యాత న్యాయవారి ముకుల్‌ రోహ్తగీని నియమించిన విషయం తెలిసిందే. దీంతో రైతుల తరపున సైతం పేరుమోసిన, రాజ్యాంగ నిపుణులు అయిన న్యాయవాదులను నియమించుకునే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు.

అందుకయ్యే వ్యయాన్ని భరించేందుకు ఎకరానికి కొంత మొత్తం వంతున విరాళాలు పోగు చేయాలని నిర్ణయించారు. ఈ స్ధితిలో ఇప్పటివరకు ఆయా కార్యక్రమాలను సమన్వయ పరచిన జేఏసీ నాయకులపై కేసులు నమోదవుతుండటంతో వారంతా అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన పరిస్ధితి తలెత్తి ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి.

 
వివిధ ప్రభుత్వ సంక్షేమ పధకాలకు అవసరమైన తెల్లరేషన్‌ కార్డు, రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో తిప్పలు తెచ్చిపెడుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన తెల్లరేషన్‌ కార్డుదారులందరిపై దృష్టి సారించారు.

తెలుపురంగు రేషన్‌ కార్డు కలిగి వున్నవారికి భూములు కొనుగోలు చేసేంతటి ఆర్ధిక స్తోమత ఏ విధంగా వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 796 మంది తెలుపురంగు రేషన్‌కార్డు కలిగిన వారిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తయ్యే సమయానికి ఆ సంఖ్య వేలల్లోకి చేరుకోగలదని అంచనా.

వారందరినీ గుర్తించేందుకు సీఐడీ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో పాత్ర ఉందని సీఐడీ ఆరోపిస్తున్న వారిలో ఎక్కువమంది రాజధాని వెలుపలి ప్రాంతాలకు చెందిన వారు కావటం గమనార్హం.

తుళ్లూరులో 238 మంది 243 ఎకరాలు, తాడికొండలో 188 మంది 180 ఎకరాలు, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు, పెదకాకానిలో 43 మంది 40 ఎకరాలు , తాడేపల్లిలో 49 మంది 24 ఎకరాలు కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలన్నీ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భాగమేనని సిఐడి అధికారులు గుర్తించినట్టు తెలిసింది. వీరంతా తెలుపురంగు రేషన్‌ కార్డులు కలిగి ఉన్నట్టు సీఐడీ అధికారులు చెబుతున్నారు.

రాజధాని ప్రాంతంలో భూములు కొన్నవారి వివరాలను ఆదాయపు పన్నుశాఖ దృష్టికి తీసుకె ళ్ళాలని అధికారులు నిర్ణయించారు. తెలుపురంగు రేషన్‌కార్డు కలిగిన వారిలో ఆదాయపు పన్ను చేల్లిస్తున్నారా? లేదా ? అనే విషయమై వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం.

వీటన్నింటికీ ఆధార్‌కార్డు కీలకం కానున్నది. చాలామంది ఆధార్‌కార్డును భూ రికార్డులకు, పాన్‌ కార్డులకు అనుసంధానం చేసుకోలేదు. దీంతో ఆయా శాఖల నుంచి వ్యక్తిగతంగా వివరాలు సేకరిస్తున్నారు.

ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎవరైనా తెలుపురంగు రేషన్‌ కార్డు కలిగి ఉంటే వారిపై చట్టపరంగా చర్య తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేజ్రీవాల్‌పై 27మంది ప్రత్యర్థులు