Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

మానవ వనరులే మన పెట్టుబడి.. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి

Advertiesment
Human resources
, బుధవారం, 18 సెప్టెంబరు 2019 (20:23 IST)
రాష్ట్రాన్ని పరిశ్రమలకు కేంద్రస్థానంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.

బుధవారం విశాఖపట్నంలోని తాజ్ గేట్ వే హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన కాన్సులేట్ బిజినెస్ మీట్ కు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచుతామన్నారు. ముఖ్యంగా వాణిజ్య రంగంలో రాణించిన నాడే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిపట్ల ఉన్న ఆలోచనలకు తగ్గ ఆచరణాత్మక కార్యక్రమాలతో పారిశ్రామికరంగంలో రాష్ట్రాన్ని ముందుండేలా తీర్చిదిద్దుతామన్నారు.

రొయ్యలు, సముద్ర ఉత్పత్తులు , సుగంధ ద్రవ్యాలు, వస్త్రరంగాల్లో ఎగుమతులు పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి అన్నారు. నాణ్యమైన పరీక్షా కేంద్రాల అవసరం రాష్ట్రంలో ఉందన్నారు. పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నామన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా మన రాష్ట్రంలో అపారమైన నైపుణ్యత కలిగిన మానవ వనరులు ఉన్నాయని, వారిని సక్రమంగా వినియోగించుకుంటే పెట్టుబడులు  వాటంతటవే వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మానవ వనరులను వినియోగించుకుంటూ అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పించి ప్రపంచంలో మేటిగా తయారు చేస్తామన్నారు.

పరిశ్రమలకు సులువుగా అనుమతులు వచ్చే విధంగా త్వరలోనే పారదర్శక పాలసీ విధానాన్ని తీసుకువస్తామని మంత్రి చెప్పారు. ఆటోమొబైల్ రంగాన్ని అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామని మంత్రి మేకపాటి వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో ఎలక్ట్రిల్ వాహనాలకు సంబంధించిన నూతన పాలసీ తీసుకువస్తామన్నారు.

రాష్ట్రంలో నీటి వనరులు వినియోగించుకుంటూ ప్రరిశ్రమల అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. జిల్లాల వారిగా ఆయా పరిశ్రమలకు అనువైన, కావలిసిన భూమిని సమకూర్చి, మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలు తరలివచ్చేలా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు జి.సాంబశివరావు, వివిధ దేశాల కాన్సులేట్లు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏమిటీ లోకాయుక్త?